Odisha Train Accident:
లూప్‌లైన్‌లోకి కోరమాండల్..
ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయగా...ప్రాథమికంగా ప్రమాదం ఎలా జరిగిందో అంచనా వేశారు అధికారులు. జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ ఆధారంగా చూస్తే...12841 కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి అప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అప్ లైన్‌లో వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. అప్పటికే గూడ్స్ లూప్ లైన్‌లో ఉంది. కానీ...కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్‌లైన్‌లోకి ఎంటర్ అయింది. వేగంగా దూసుకెళ్లి లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌ట్రైన్‌ని బలంగా ఢీకొట్టింది. ఫలితంగా...దాదాపు 10-15 కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. సరిగ్గా అదే సమయానికి యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ వచ్చి పట్టాలపై పడి ఉన్న కోరమండల్ కోచ్‌లను ఢీకొట్టి అదుపు తప్పింది. ఇలా ఒక్క చోటే మూడు ప్రమాదాలు జరిగాయని ప్రైమరీ రిపోర్ట్ స్పష్టం చేసింది. అయితే...ప్రస్తుతానికి దీనిపై రైల్వే శాఖ అధికారికంగా స్పందించలేదు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ప్రమాదానికి కారణాలంటే వెల్లడించలేదు. కమిటీ విచారణ పూర్తైన తరవాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రైల్వే సేఫ్‌టీ కమిషనర్ రిపోర్ట్ వచ్చాకే అసలు కారణాలేంటో తెలుస్తాయని తేల్చి చెప్పారు.
ట్రాఫిక్ చార్ట్
ఈ రిపోర్ట్‌తో పాటు మరి కొన్ని కీలక వివరాలూ వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా రైల్వే అధికారులు రైల్ ట్రాఫిక్‌కి సంబంధించి కొన్ని ఛార్ట్‌లు (Rail Traffic Chart) తయారు చేసుకుంటారు. ఈ ఛార్ట్‌లో అప్ లైన్ (Up Line), డౌన్ లైన్, లూప్ లైన్ (Loop Line) అని స్పష్టంగా మెన్షన్ చేస్తారు. అప్ లైన్‌లో వెళ్లాల్సిన ట్రైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు లూప్‌లైన్‌లో గూడ్స్ ట్రైన్‌లను ఆపేస్తారు. అప్‌లైన్‌లోని ట్రైన్ వెళ్లిపోయాక...లూప్‌లైన్‌లోని గూడ్స్‌కి లైన్ క్లియర్ చేస్తారు. రైల్వే ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడంలో లూప్ లైన్‌దే కీలక పాత్ర. కానీ...అప్‌లైన్‌లో ఉన్న ట్రైన్ లూప్ లైన్‌లోకి ఎలా వెళ్లింది అన్నదే అంతు తేలకుండా ఉంది.