Nykaa CFO Resigns: నైకా బ్రాండ్‌తో బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్న ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ-కామర్స్ వెంచర్స్ (FSN E-Commerce Ventures) నెత్తిన మరో పిడుగు పడింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అరవింద్ అగర్వాల్, తన పదవికి రాజీనామా చేశారు.  మంగళవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం, కొత్త CFOని నియమించే పనిలో ఉన్నట్లు నైకా వెల్లడించింది.


ఈ వార్తతో నైకా షేర్లలో ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగింది. మంగళవారం, BSEలో 4.55% క్షీణించి రూ. 175.20 వద్ద ముగిసిన షేర్‌ ధర, ఇవాళ (బుధవారం) దాదాపు 4% నష్టంతో రూ. 169 దగ్గర ప్రారంభం అయింది.


ఈ నెల 25వ తేదీ పని గంటలు ముగిసిన నాటి నుంచి అరవింద్‌ అగర్వాల్‌ రాజీనామా అమల్లోకి వస్తుంది. డిజిటల్‌ ఎకానమీ, స్టార్టప్స్‌లో కొత్త అవకాశాల కోసం నైకాకు రాజీనామా చేసినట్లు అరవింద్‌ ప్రకటించారు.


2020 జులైలో Nykaa CFOగా అరవింద్‌ అగర్వాల్‌ జాయిన్‌ అయ్యారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. FSN E-Commerce Venturesను లాభాదాయక స్టార్టప్‌గా మార్చడంలో అరవింద్‌ కీలక పాత్ర పోషించారు. స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీ లిస్టింగ్‌లోనూ తన ముద్ర వేశారు. అంతకుముందు అమెజాన్ ఇండియాలో FP&A లీడర్ & బిజినెస్ కంట్రోలర్‌గా ఉన్నారు. దీని కంటే ముందు వొడాఫోన్ ఇండియాలో ఐదేళ్ల పాటు కీలక బాధ్యతల్లో పని చేశారు.


ఏడాది క్రితం, 2021 నవంబర్‌ 10వ తేదీన నైకా షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యాయి. లిస్టింగ్‌ నాటి నుంచి ఈ న్యూ-ఏజ్‌ కంపెనీకి బ్యాడ్‌టైమ్‌ నడుస్తోంది. రిచ్‌ వాల్యుయేషన్‌ కావడంతో, అప్పట్నుంచీ షేర్‌ ధర పడిపోతూనే ఉంది.


లాక్‌-ఇన్‌ ముగిసిన తర్వాత కష్టాలు రెట్టింపు 
నైకా షేర్లు స్టాక్‌ మార్కట్‌లో లిస్ట్‌ అయి ఈ ఏడాది నవంబర్‌ 9 నాటికి సరిగ్గా సంవత్సరం అయింది. దీంతో, యాంకర్‌ ఇన్వెస్టర్ల ఏడాది లాక్‌-ఇన్‌ గడువు ముగిసింది. ఈ కంపెనీ షేర్లను అమ్ముకోవడానికి వాళ్లకు స్వేచ్ఛ దొరికింది. లాక్‌-ఇన్‌ పిరియడ్‌లో ఉన్నంతవరకు, తమ దగ్గరున్న ఆ కంపెనీ షేర్లను యాంకర్‌ ఇన్వెస్టర్లు అమ్మలేరు. ఏడాది గడువు తర్వాత స్వేచ్ఛ దొరకగానే ఒక్కసారిగా లక్షల సంఖ్యలో షేర్లను మార్కెట్‌లోకి తెస్తారు. సాధారణంగా, ఈ కారణం వల్లే లాక్‌-ఇన్‌ గడవు ముగియగానే ఏ కంపెనీ షేర్‌ ధర అయినా పడిుపోతూ ఉంటుంది.


లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ముగియగానే నైకా షేర్లలో భారీ డీల్స్‌ జరిగాయి. షేర్‌ ధర పతనంలో వేగం పెరిగింది. గత వారం, 96,89,240 షేర్లను, ఒక్కో షేరును సగటున రూ. 171 ధర చొప్పున లైట్‌హౌస్ ఇండియా ఫండ్ III (యాంకర్‌ ఇన్వెస్టర్లలో ఇది ఒకటి) విక్రయించింది. సెగంటి ఇండియా మారిషస్ (యాంకర్‌ ఇన్వెస్టర్లలో ఇది కూడా ఒకటి) కూడా నవంబర్ 15న 33,73,243 నైకా షేర్లను విక్రయించింది. ఒక్కో షేరును సగటున రూ. 199 వద్ద విక్రయించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.