Breaking News Telugu Live Updates: మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలకు ఈడీ నోటీసులు....
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలకు ఈడీ నోటీసులు....
మనీలాండరింగ్ నిరోధక చట్టం 2005లోని సెక్షన్ 50 కింద కాంగ్రెస్ నేతలకు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఈ డీ నోటీసులు
నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎండీ అలీ షబ్బీర్, పీ సుదర్శన్ రెడ్డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం 2005లోని సెక్షన్ 50 కింద కాంగ్రెస్ నేతలకు నోటీసులు అందాయి.
అక్టోబర్ 10న సుదర్శన్ ఈడీ ఎదుట హాజరు కావాలని కోరగా, షబ్బీర్ మరుసటి రోజు హాజరుకావాల్సి ఉంటుంది.
నేషనల్ హెరాల్డ్ విచారణలో పాల్గొన్న కంపెనీల ఖాతాలకు ఇద్దరు నేతలు మొత్తాలను బదిలీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
గతంలో వివిధ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన నగరానికి చెందిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేతకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
తిరుపతి : ముఖ్యమంత్రికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన మంత్రులు..
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రేణిగుంట విమానశ్రయంలో ఘన స్వాగతం పలికారు.. అనంతరం చిత్తూరు జిల్లా కుప్పంకు చేరుకుని చేయూత కార్యక్రమంలో పాల్గొననున్నారు.. రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, తిరుపతి నగర పాలక మేయర్ డా శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి ఎమ్మెల్యే లు భూమన కరుణాకరరెడ్డి కోనేటి అదిమూలం, బియ్యపు మధుసూధన్ రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు..
వైసీపీ నేత హత్యతో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉద్రిక్తత నెలకొంది. ఒంగోలు నుంచి అదనపు బలగాలను తెప్పించి సింగరాయకొండలో మోహరించారు. కాగా, పాతకక్షల నేపథ్యంలో వైసీపీ నేత పసుపులేటి రవితేజను దుండగులు నిన్న లారీతో ఢీకొట్టి హత్య చేశారు. విషయం తెలియడంతో సింగరాయకొండ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. నిందితులు హత్యకు ఉపయోగంచిన లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న వారిలో కొందరు పోలీస్ స్టేషన్ గోడలు దూకి లారీకి నిప్పటించారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పాయి. లారీకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న చలివేంద్రాన్ని కూడా తగలబెట్టారు. పట్టణంలోని దుకాణాలను మూసివేయించారు. వారిని అదుపు చేసేందుకు ఉన్నతాధికారులు ఒంగోలు నుంచి అదనపు బలగాలను రప్పించి మోహరించారు. డీఎస్పీ, సీఐ, ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఆందోళనలు హింసాత్మకంగా మారకుండా చర్యలు చేపట్టారు.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టాటా స్టీల్: 7 అనుబంధ సంస్థలు - టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, టాటా మెటాలిక్స్, ది టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టిఆర్‌ఎఫ్, ఇండియన్ స్టీల్ & వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్&టీ మైనింగ్‌ను మాతృ సంస్థ టాటా స్టీల్‌లో విలీనం చేయడానికి కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది.
హీరో మోటోకార్ప్: ఈ టూ-వీలర్ ఆటో మేజర్, తన మోటార్ సైకిళ్లు & స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధరలను తక్షణమే అమల్లోకి వచ్చేలా, ఒక్కో యూనిట్ మీద రూ.1,000 వరకు పెంచింది. మోడల్, మార్కెట్‌ను బట్టి ధర పెరుగుదలలో చిన్నపాటి వ్యత్యాసాలు ఉంటాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.. ప్రతి శుక్రవారం ఆకాశ గంగ జలంతో శ్రీవేంకటేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది.. గురువారం 22-0 9-22 రోజున 65,187 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 27,877 మంది తలనీలాలు సమర్పించగా, 5.37 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనంకు దాదాపుగా 12 గంటల సమయం పడుతుంది..ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది..
Background
Breaking News Telugu Live Updates: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడిని లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేశారు. జిల్లాలోని సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా నడిరోడ్డుపై వైసీపీ నేత పసుపులేటి రవితేజను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపులేటి రవితేజ (32) ప్రకాశం జిల్లాలోని మూలగుంటపాడు గ్రామానికి చెందిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. అక్కడే ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. రవితేజ తండ్రి శ్రీనివాసరావు సోమరాజుపల్లి మాజీ సర్పంచి. రవితేజ, తన స్నేహితుడు ఉమ వేర్వేరు బైకులపై కనుమళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ రవితేజ బైక్ ను ఢీకొట్టడంతో రోడ్డు మీద పడిపోయాడు. అంతటితో ఆగకుండా లారీ డ్రైవర్ బైకుతో పాటు రవితేజను తొక్కిస్తూ వెళ్లిపోయాడు. లారీ తన మీద నుంచి వెళ్లడంతో వైసీపీ నేత రవితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో నేడు సైతం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా మధ్య ఆంధ్ర మీదుగా గాలుల సంఘమం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు సెప్టెంబర్ 24 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ ను నేడు సైతం మేఘాలు కమ్మేశాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 24 వరకు పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు విశాఖ నగర పరిసర ప్రాంతాలలో పిడుగుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. గాజువాక - విమానాశ్రయం వైపు వర్షాలు నమోదవుతాయి. కాకినాడ జిల్లాలోని దక్షిణ భాగాలు ముఖ్యంగా కాకినాడ సిటీ - యానాంతో పాటుగా తూర్పు గోదావరి జిల్లా పోలవరం - రంపచోడవరం పరిసరాలు, పార్వతీపురం మణ్యం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు ఉత్తర భాగాలు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -