Amit Shah on Pakistan: 'పాక్.. జాగ్రత్త!.. మితిమీరితే ఇక చర్చలు ఉండవు.. మెరుపుదాడులే'

ABP Desam   |  Murali Krishna   |  14 Oct 2021 04:59 PM (IST)

పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల్లో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తే మెరుపుదాడులు తప్పవని హెచ్చరించారు.

పాకిస్థాన్‌కు అమిత్ షా హెచ్చరిక

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు పాక్ కుట్రలు పన్నితే మరిన్ని లక్షిత దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమిత్ షా హెచ్చరించారు. అలాంటి దుస్సాహసాలకు పాల్పడితే గట్టి బదులిస్తామన్నారు.

దేశ సరిహద్దుల్లో అతిక్రమణలకు పాల్పడినా, కశ్మీర్‌లోని అమాయక ప్రజల్ని చంపేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే పాకిస్థాన్‌కు మరిన్ని మెరుపు దాడులు తప్పవు. భారత్‌పై దాడి చేస్తే సహించబోమని గతంలో మెరుపు దాడులతో నిరూపించాం.                                 - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
 
గోవాలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి అమిత్ షా గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గతంలో పాకిస్థాన్‌పై చేసిన మెరుపుదాడులకు సారథ్యం వహించిన రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్‌ను గుర్తు చేసుకున్నారు.
 
ఆ లక్షిత దాడులతో పాకిస్థాన్‌కు గట్టి సందేశమిచ్చామన్నారు. అయితే ఇప్పుడు మాత్రం బదులిచ్చే సమయం వచ్చేసిందని.. ఇక చర్చలు ఉండబోవని అమిత్ షా అన్నారు. 
 
గతంలో ఉరీ, గురుదాస్‌పుర్‌, పఠాన్‌కోట్‌లలో పాక్ ఉగ్రవాదులు చేసిన దాడులకు భారత్ ప్రతిగా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది.
Published at: 14 Oct 2021 04:55 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.