Noida Dog Attack: ఈ మధ్య ఎక్కడ చూసినా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో ఓ పసికందుపై కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందింది.
ఇదీ జరిగింది
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లోటస్ బౌలేవార్డ్ సెక్టార్ 100లో సోమవారం సాయంత్రం ఈ విషాదం జరిగింది. హౌసింగ్ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే కూలి పని చేసుకునే ఓ కుటుంబం తమ 7 నెలల పాపతో అక్కడే ఉంటోంది. సోమవారం సాయంత్రం ఓ వీధి కుక్క ఎవరూ లేని సమయంలో ఆ పసికందుపై దాడి చేసింది.
తీవ్రంగా గాయపడిన శిశువును వెంటనే నోయిడాలోని యదార్థ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఐసీయూలో చేర్చారు. పసికందు పేగులు బయటకు రావటం వల్ల శస్త్రచికిత్స చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
స్థానికుల ఆందోళన
ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి శునకాల సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేశారు.
దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Viral Video: 'మా అమ్మను జైల్లో పెట్టేయండి, నా చాక్లెట్లు కొట్టేస్తుంది'- బుడతడి కంప్లెయింట్