Cordelia Cruise No Permission :  విశాఖ నుంచి బయలుదేరిన క్రూయిజ్ షిప్‌ తమ తీరానికి రావడానికి పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతించలేదు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన క్రూయిజ్ ఇప్పుడు నడిసంద్రంలో ఉండిపోవాల్సి వచ్చింది.  విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై క్రూయిజ్ వెళ్లాల్సి ఉంది.  అయితే క్యాసినో, గ్యాంబ్లింగ్ ఆడే క్రూయిజ్‌కు అనుమతిచ్చేది లేదంటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై బ్రేక్ వేశారు. దీంతో  షిప్ నడి సంద్రంలోనే ఆగిపోయింది.


క్యాసినో, గ్యాంబ్లింగ్ ఉండే క్రూయిజ్‌ను పుదుచ్చేరిలోకి అనుమతించొద్దు అంటూ అక్కడి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన గవర్నర్‌ క్రూయిజ్‌ను అనుమతించాలంటే అందులో క్యాసినో, గ్యాంబ్లింగ్ లేదని నిర్ధారణ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. పుదుచ్చేరి సమీపంలో లగ్జరీ క్రూయిజ్ షిప్‌కు లంగరు వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. సంచలనం సృష్టించిన ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు జరిగింది కూడా కోర్డెలియా క్రూయిజ్‌ షిప్‌లోనే కావడంతో అనుమతి ఇవ్వడానికి సందేహిస్తున్నారు. 
  
ప్రజలకు లగ్జరీ క్రూయిజ్‌లో కొత్త సముద్ర ప్రయాణ అనుభూతిని అందించాలని తమిళనాడు ప్రభుత్వం కోర్డెలియా క్రూయిజ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.  తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన ఈ క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతించడం లేదు .విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లే ట్రిప్‌లో పదో తేదీ ఉదయం పుదుచ్చేరి చేరుకోవాలి.  విశాఖ నుంచి పుదుచ్చేరికి, విశాఖ నుంచి చెన్నైకి నిర్వాహకులు టికెట్లు విక్రయించారు. గ్యాంబ్లింగ్ కారణంగా క్రూయిజ్‌ను పుదుచ్చేరి అనుమతించడం లేదని తెలియడంతో విశాఖలో ఆ షిప్‌ను ప్రారంభిచిన మంత్రి రోజాపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  



 

ప్రస్తుతం పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతించకపోవడంతో క్రూయిజ్‌ నేరుగా చెన్నై వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే షిప్ యాజమాన్యం పుదుచ్చేరి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. అవి కొలిక్కి వస్తే సరి లేకపోతే పుదుచ్చేరిలో స్టాప్ లేకుండా చెన్నై వెళ్లిపోతుంది. ప్రస్తుతానికైతే నడిసంద్రంలో షిప్ ఉండిపోయింది.