బీట్‌రూట్ టేస్టు చాలా మందికి నచ్చదు. పిల్లలు తినడానికి ఇష్టపడరు. నిజానికి బీట్‌రూట్ తినాల్సింది పిల్లలు, మహిళలే. రక్త హీనత సమస్య రాకుండా ఉండాలంటే ముఖ్యంగా తినాల్సింది బీట్‌రూట్‌నే. కూరగా తినేందుకు పిల్లలు ఇష్టపడకపోతే ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెడితే తినే అవకాశం ఉంది. 


కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ - రెండు కప్పులు
పెరుగు - ఒక  కప్పు
బీట్ రూట్ - మీడియం సైజుది ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడా 
 
తయారీ ఇలా
1. స్టవ్ పై కళాయి పెట్టి బొంబాయి రవ్వను కాస్త వేయించాలి. రంగు మారకుండా చూసుకోవాలి. పచ్చి వాసన రాకుండా రెండు నిమిషాలు వేయిస్తే చాలు. 


2. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ వేసి కప్పు పెరుగును వేయాలి. ఆ రెండింటినీ బాగా కలిపి రుబ్బులా రెడీ చేసుకోవాలి. అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు.


3. ఇప్పుడు బీట్‌రూట్ ను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. 


4. ఇడ్లీ రుబ్బులో బీట్‌రూట్ పేస్టును వేసి బాగా కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పావుగంట సేపు అలా పక్కన వదిలేయాలి. 


5. తరువాత ఇడ్లీ ప్లేట్లకు కాస్త ఆయిల్ రాసి రుబ్బును వేయాలి. 


6. పావుగంట తరువాత ఇడ్లీ రెడీ. మీకు పచ్చిగా ఉండే బీట్ రూట్ వాడాలనిపించకపోతే, బీట్ రూట్ ముక్కలను నూనెలో కాసేపు వేయించచ్చు. పసుపు, ఉప్పు వేసి వేయిస్తే రుచి బావుంటుంది. వాటిని పేస్టులా చేసుకుని వాడుకోవచ్చు. 


బీట్రూట్ వల్ల ఎన్ని లాభాలో...
1. బీట్‌రూట్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 
2. బీట్ రూట్లో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. ఇది రక్త హీనత సమస్యను తప్పిస్తుంది. 
3. కాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, సి, మెగ్నిషియం వంటివి అధికంగా ఉంటుంది. 
4. బీట్‌రూట్ రోజూ తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. 
5. మధుమేహం ఉన్న వారు బీట్ రూట్‌ను తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. 
6. గర్భిణిలు దీన్ని తినడం వల్ల ఫోలిక్ ఆమ్లం బిడ్డకు అంది, ఎదుగుదల బావుంటుంది. 
7. కాలేయాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచేందుకు బీట్ రూట్ సాయపడుతుంది. 
8. బీపీని నియంత్రణలో ఉంచడంలో ముందుంటుంది. 
9. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే బీట్రూట్ తరచూ తినాలి. 
10. కొలెస్ట్రాల్‌ను కరిగించే శక్తి బీట్ రూట్‌కు ఉంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు బీట్ రూట్ ను వారంలో రెండు నుంచి మూడు సార్లు తినడం ఉత్తమం. 


Also read: ముద్దు పెట్టుకునే సంస్కృతి ఏ కాలంలో మొదలైంది? ముద్దుకు అంత ప్రాధాన్యత ఎందుకు?


Also read: తనను తానే పెళ్లి చేసుకుని కొత్త ట్రెండ్ సెట్ చేసిన యువతి, అందుకు కారణాలు ఇలా చెబుతోంది