Nitish Kumar Kharge Meet:


విపక్షాల ఐక్యత..


విపక్షాల ఐక్యతకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమయ్యారు. ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. సమావేశం ముగిసిన తరవాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదో చరిత్రాత్మక భేటీ అని, ఎన్నో సమస్యలపై చర్చ జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. ఒక్కటిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. 


"ఇవాళ చరిత్రాత్మక సమావేశం జరిగింది. చాలా సమస్యలు చర్చించాం. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి, కలిసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 






ఈ భేటీపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా స్పందించారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో తమ వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తామని స్పష్టం చేశారు. 


"వీలైనంత వరకూ అన్ని పార్టీలనూ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తాం. కలిసి కట్టుగా ముందుకెళ్లి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాం"


- నితీష్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి 






ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం అంతా ఒక్కటిగా నిలబడతామని తెలిపారు. విపక్షాలను ఏకం చేసేందుకు ఇదో కీలక అడుగుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. 


"ప్రతిపక్షాలను ఒక్కటి చేసేందుకు ఇదో కీలక అడుగుగా భావిస్తున్నాం. ప్రతిపక్షాల విజన్ ఏంటో త్వరలోనే వెల్లడిస్తాం. ఆ విజన్‌తోనే కలిసికట్టుగా ముందుకెళ్తాం. దేశం కోసం నిలబడతాం"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత