Is Bihar CM going to resign: బీహార్ రాజకీయాల్లో మరోసారి భారీ మార్పులు జరగబోతున్నాయనే వార్తలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని, దీనిపై జెడియు , బిజెపి అగ్రనాయకత్వం మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ నితీష్ కుమార్ ఢిల్లీ రాజకీయాల వైపు అడుగులు వేస్తే, బీహార్ ముఖ్యమంత్రి పీఠం ఖాళీ అవుతుంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది.
నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైతే, బీహార్‌లో తమ పార్టీకి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని బిజెపి గట్టి పట్టుదలతో ఉంది. ప్రస్తుతం కూటమిలో అత్యధిక బలం కలిగిన పార్టీగా బిజెపి ఉన్నందున, ముఖ్యమంత్రి పదవిపై ఆ పార్టీ సహజంగానే తన వాదనను వినిపిస్తోంది. 2026 రాజ్యసభ ఎన్నికల సమీకరణాల్లో ఈ అధికార మార్పిడికి సంబంధించిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
నితీష్ కుమార్ 75 ఏళ్లు దాటడం, కేంద్ర రాజకీయాల్లో ఏదైనా కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు, ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు జెడియు శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. వారసత్వ ప్రణాళికలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి.
నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్తారా లేదా అనే అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ, ఒకవేళ అదే జరిగితే బీహార్‌లో సుదీర్ఘకాలం సాగిన నితీష్ యుగం ముగిసి, తొలిసారిగా బిజెపి తన సొంత ముఖ్యమంత్రిని పీఠంపై కూర్చోబెట్టే అవకాశం దక్కుతుంది. అయితే అలాంటి చర్చ జరగడం లేదని ఎన్డీఏ మిత్రపక్ష నేత చిరాగ్ పాశ్వాన్ అంటున్నారు.
ఈ పరిణామం రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయాల్లో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో వేచి చూడాలి.
