Iran Israel Conflict Auto Industry: మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాకడం భారత్ వంటి 'దిగుమతులపై ఆధారపడే దేశాలకు' పెద్ద ఆందోళనగా మారింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 79-82 డాలర్ల మధ్య ఊగిసలాడుతున్నాయి. పరిస్థితి చల్లబడకపోతే 90 డాలర్ల మార్క్ చేరే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

భారత్, ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆయిల్ వినియోగ దేశం. బ్యారెల్ ధరలో ఒక్క డాలర్ పెరిగినా మన దేశానికి ఏటా దాదాపు ₹12,000 కోట్ల అదనపు దిగుమతి భారం పడుతుంది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఈ గణాంకమే చెబుతోంది.

ఆటో రంగానికి డబుల్ షాక్

ఇంధన ధరలు పెరిగితే మొదట ప్రభావం పడేది వాహన యజమానుల జేబులపైనే. ఇప్పటికే బండి/బండ్లు ఉన్నవారికి నెలవారీ ఇంధనం ఖర్చు పెరుగుతుంది. అంతేకాదు, కొత్త వాహనం కొనాలనే ఆలోచన వాయిదా పడే అవకాశమూ ఉంటుంది. ఇదే సమయంలో లాజిస్టిక్స్ ఖర్చులు కూడా పెరుగుతాయి. వాహనాల రవాణా నుంచి విడిభాగాల సరఫరా వరకు అన్ని ఖర్చులు పెరిగి కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా, కొత్త వాహనాల ధరలు పెరిగే సూచన కూడా కనిపిస్తుంది.

భారత ప్రభుత్వం, తొలి దశలో, ఈ షాక్‌ను ఓర్చుకోమని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు చెప్పొచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. చివరికి, పెరిగిన ధరలు వినియోగదారులపైకే వస్తాయి.

హోర్ముజ్ జలసంధి - కీలక కేంద్రం

ఈ సంక్షోభంలో కీలక పాత్ర పోషిస్తున్నది హోర్ముజ్ జలసంధి. ప్రపంచ ఆయిల్ సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండా సాగుతుంది. భారత్‌లోకి దిగుమతి చేసుకునే క్రూడ్‌లో దాదాపు 50 శాతం, LNGలో 54 శాతం ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. ఈ మార్గాన్ని మూసేయడంతో ఇన్సూరెన్స్ రేట్లు పెరగడం, భద్రతా భయాలతో షిప్‌లు ఆలస్యమవుతున్నాయి.

రష్యా వైపు మళ్లే అవకాశం?

ఇటీవల అమెరికా ఒత్తిడి నేపథ్యంలో భారత రిఫైనరీలు రష్యా నుంచి దిగుమతులు తగ్గించాయి. అయితే మధ్యప్రాచ్య సరఫరాలో అంతరాయం కలిగితే మళ్లీ రష్యా క్రూడ్ వైపు మళ్లే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రష్యా నుంచి సరఫరా లాజిస్టిక్స్ పరంగా సులభంగా ఉంటుంది.

Indian Oil Corporation, Bharat Petroleum Corporation Limited వంటి కంపెనీలు గతంలో రష్యా క్రూడ్ దిగుమతుల్లో ముందున్నాయి. అవసరమైతే అమెరికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల నుంచి కూడా దిగుమతులు పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరల కారణంగా దిగుమతి బిల్లు పెరగడం ఖాయం.

90 డాలర్ల మార్క్ దాటితే?

బ్రెంట్ క్రూడ్ 90 డాలర్లకు మించి రెండు వారాల కంటే ఎక్కువకాలం నిలిస్తే భారత్ సహా ప్రపంచ మార్కెట్లు విధాన మార్పులు చేపట్టాల్సి వస్తుంది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వినియోగ వ్యయం అన్నీ ప్రభావితమవుతాయి.

తెలుగు రాష్ట్రాలపై ప్రభావం?

తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. మరింత పెరిగితే వ్యక్తిగత వాహన వినియోగం తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరగొచ్చు.

మొత్తానికి, ఈ అంతర్జాతీయ ఘర్షణ భారత్ ఆటో రంగానికి తాత్కాలికంగా పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరుగుతూ పోతే ప్రజలు, కంపెనీలు, ప్రభుత్వం - ఈ ముగ్గురికీ కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు అందరి ఆందోళన ఒక్కటే - క్రూడ్ ధరలు 90 డాలర్ల దిశగా వెళ్తాయా అని.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.