Nirmal BJP MLA Maheshwar Reddy: నిర్మల్: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం సభా విధానాలు, సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్‌ సభ్యులను కాదని అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం, మజ్లీస్ పార్టీ మెప్పు కోసం, కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకుందన్నారు. 


కాంగ్రెస్ ప్రభుత్వం సభ సంప్రదాయాలను ఉల్లంఘించడం వల్లనే బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన సభ్యులు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయలేరని మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో ఎంఐఎం, బీజేపీ దోస్తులని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని, ప్రస్తుతం ఆ పార్టీ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకే రక్తమని, మూడు పార్టీలు ఒకే నావపై ప్రయాణం చేస్తున్నాయి ఎద్దేవా చేశారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని కించపరిచిన అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ నియమించడాన్ని సహచర సభ్యుడు రాజాసింగ్ వ్యతిరేకించారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రొటెం స్పీకర్ నియమించడంపై వ్యతిరేకించి అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపామని ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 


ఈ నెల 14న దళిత బిడ్డ, స్పీకర్ గా నియమితులైన ప్రసాద్ సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గ చరిత్ర ఎన్నడూ లేని విధంగా 51 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని, ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని సమస్యల పరిష్కారానికి దశలవారీగా పరిష్కరిస్తానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ తో ఊహించని అభివృద్ధి జరిగేదన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ ఆశయాలకు అనుగుణంగా డబుల్ ఇంజన్ సర్కార్ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. 
అవినీతి బయటకు తీస్తాం..
నిర్మల్ లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని డీ1 పట్టాలు చేసిన జాబితా సిద్ధంగా ఉందని, ఒక్కొక్కటి బయటకు తీస్తామన్నారు. పేద భూములను కబ్జా చేసిన వారిని విడిచి పెట్టేది లేదని, దీనిపై కమిషన్ వేసి నిజానిజాలను బయటకు తీస్తామని పేర్కొన్నారు. భూ అక్రమలపై అసెంబ్లీలో గళమెత్తుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసపూరిత మేనిఫెస్టోను రూపొందించి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే హర్షిస్తామని, లేనట్లయితే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు రావుల రామ్ నాథ్, మెడిసెమ్మ రాజు, చందు, ముత్యం రెడ్డి, అర్జున్, జమాల్, వెంకటేష్, రాచకొండ సాగర్, శంకర్ పతి, కొండాజీ శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.