"రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ " విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫోటోలు.. ఇతర ఆధారాలను చూస్తే భారీగా పనులు జరిగాయని అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అంశంలో అధికారులను జైలుకు పంపిన సందర్భాలు గతంలో ఏమైనా ఉన్నాయా అనే అంశంపై తమకు వివరాలు తెలియచేయాలని పిటిషనర్లను ఎన్జీటీ ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను నేరుగా జైలుకు పంపే అధికారాలు ఎన్జీటీకి ఉన్నాయా లేక హైకోర్టు ద్వారా పంపాలా అన్న విషయాల్ని కూడా చెప్పాలని పిటిషనర్లను కోరింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆన్‌లైన్‌లో నివేదిక సమర్పించలేదు. దీనిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించింది. విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజే ఆదేశాలిస్తామని ఎన్జీటీ తెలిపింది.
కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద ఏపీ సర్కార్ సీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తోంది. పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీ, డీపీఆర్ అనుమతి లేదని కృష్ణాబోర్డు ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆదేశించాయి. అయితే ప్రభుత్వం మాత్రం కాంట్రాక్ట్‌ను అప్పగించి పనులు చేయిస్తోంది. దీనిపై ఎన్జీటీలో ఫిర్యాదులు దాఖలు కావడంతో విచారణకు ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ప్రాజెక్టును పరిశీలించేందుకు అంగీకరించకపోవడంతో పలుమార్లు కేఆర్ఎంబీ పర్యటన వాయిదా పడింది. ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో చివరికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కృష్ణాబోర్డు కమిటీ ఐదు రోజుల క్రితం పూర్తి చేసింది. ఎన్జీటీ ఆదేశాలతో తెలుగు అధికారులెవరూ లేకుండా కమిటీని ఏర్పాటు చేసుకుని రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు వెళ్లారు. నివేదికను సిద్ధం చేశారు.
Also Read: Ramya Murder: రమ్య మృతదేహం తరలింపు అడ్డగింత.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ఫ్యామిలీకి నగదు చెక్కు అందించిన హోంమంత్రి
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ వద్ద పనులు జరుగుతున్నాయని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కమిటీ.. నివేదికను సిద్ధం చేసింది. అక్కడ పనులేమీ జరగడంలేదని వాదిస్తున్న ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టులో వివరాలు పొందుపరిచారు. ఏ ఏ పనులు ఎంత మేర జరిగాయో ఫోటోలతో సహా వివరించారు. డీపీఆర్ కోసం అవసరమైన పనులే చేస్తున్నామని ఏపీప్రభుత్వం వాదిస్తోంది. అయితే అంతకుమించిన పనులు జరిగాయని కృష్ణా బోర్డు తేల్చింది. ఈ నివేదిక ఆన్‌లైన్‌లో ఎన్జీటీకి అందాల్సి ఉంది.
తాము స్టే ఇచ్చినా నిర్మాణాలు ప్రారంభించి ఉంటే సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలో విచారణ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ హెచ్చరించింది. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎన్జీటీ ఖరారు చేయడంతో తదుపరి విచారణపై అధికారుల్లోనూ ఉత్కంఠ ప్రారంభమయింది. పనులు జరిగినట్లుగా ఉంటే సీఎస్‌ను జైలుకు పంపిస్తామని గతంలోనే ఎన్జీటీ హెచ్చరించింది. ఈ సారి విచారణలో అధికారులపై చర్యలు తీసుకుంటే రాజకీయంగానూ ఈ అంశం కలకలం రేపే అవకాశం ఉంది. అయితే పనులు చేసినట్లుగా ఎన్జీటీ విచారణలో అంగీకరించిన ఏపీ ప్రభుత్వం.. ఏడో తేదీ నుంచి మొత్తం పనులు ఆపేశామని ఎన్జీటీకి తెలిపింది. ఈ మొత్తం అంశంపై 27వ తేదీన సంచలనాత్మక తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: Volunteer suicide : అనంతపురం జిల్లా రాయదుర్గంలో వాలంటీర్ ఆత్మహత్య.. సీఎంకు రాసిన లేఖలో ఏం చెప్పారంటే..?