Covid Like Pandemic: కొవిడ్‌ సంక్షోభం సృష్టించిన అలజడిని ప్రపంచం ఇప్పుడిప్పుడే కాస్త మర్చిపోతోంది. సాధారణ పరిస్థితులకు అలవాటు పడిపోయారు. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలో శాస్త్రవేత్తలు వెన్నులో వణుకు పుట్టించే విషయం చెప్పారు. మరో మహమ్మారి ప్రపంచంపై ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదముందని హెచ్చరించారు. జంతువుల నుంచి మనుషులకి ఈ వైరస్ వ్యాపించే అవకాశముందని వెల్లడించారు. ఈ కారణంగా మరో మహమ్మారిని ఎదుర్కోక తప్పకపోవచ్చని అన్నారు. అయితే...ఈ మహమ్మారి ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పలేమని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి ఇందుకు తగిన విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. వైరస్‌లపై నిఘా పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పర్యావరణ మార్పులు, భూతాపం పెరగడం, అడవులను ధ్వంసం చేయడం లాంటివి వైరల్, బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతున్నాయని నిపుణులు వెల్లడించారు. ఇవే అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని వివరించారు. మనంతట మనమే ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నామని King’s College Londonకి చెందిన ఓ ప్రొఫెసర్ తెలిపారు. కరోనా ఎంత విధ్వంసం సృష్టించిందో గమనించామని, మరో సంక్షోభం ఎప్పుడైనా ముంచుకు రావచ్చని అన్నారు. 


"మరో మహమ్మారి ఎప్పుడైనా దాడి చేయొచ్చు. అది రెండేళ్లలో వస్తుందా లేదంటే 20 ఏళ్ల సమయం పడుతుందా అన్నది స్పష్టంగా చెప్పలేం. కానీ కచ్చితంగా మరో సంక్షోభాన్ని మాత్రం ఎదుర్కోక తప్పదు. అలా అని మనం నీరసపడిపోవాల్సిన పని లేదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి త్యాగాలకైనా మనమంతా సిద్ధంగా ఉండాలి"


- ప్రొఫెసర్ 


మళ్లీ ఎందుకీ సంక్షోభం..?


అమెజాన్ అడవులు ధ్వంసం అవుతున్నాయి. అటు ఆఫ్రికాలోనూ అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. ఫలితంగా చాలా వరకు జంతువులు, కీటకాలు అడవులకు సమీపంలోని ఇళ్లలోకి వెళ్తున్నాయి. వీటిలో కొన్ని వైరస్‌, బ్యాక్టీరియాని వ్యాప్తి చేస్తున్నాయి. దీంతో పాటు వాతావరణ మార్పులూ సమస్యని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దోమల ద్వారా డెంగీ, చికున్‌గునియా లాంటి వ్యాధులు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్ తరహా మహమ్మారులు పుట్టుకొస్తున్నాయి.