Lok Sabha Polls 2024: వచ్చే 100 రోజులు అత్యంత కీలకం అని పార్టీ కార్యకర్తలకు వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ జాతీయ సమావేశాల్లో ఆయన కీలక ప్రసంగం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున అందరూ ఉత్సాహంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడాలని సూచించారు. 400 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. బీజేపీ మరోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో అవినీతి మరక లేకుండా పరిపాలించామని గుర్తు చేశారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, దేశమే ముఖ్యమని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలవి అబద్ధపు వాగ్దానాలు అని మండి పడ్డారు. వికాస్‌ భారత్ అనే హామీని తమ ప్రభుత్వం తప్ప మరెవరూ ఇవ్వలేదని అన్నారు. 500 ఏళ్ల కలని నెరవేరుస్తూ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించామని తేల్చి చెప్పారు. బీజేపీ కార్యకర్తలంతా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. 18 ఏళ్లు నిండిన వారు ఈసారి 18వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌ బీజేపీ లక్ష్యం అని వెల్లడించారు. నవభారత నిర్మాణం కోసం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. 


"వచ్చే 100 రోజులు అత్యంత కీలకం. ఈలోగా కార్యకర్తలు ప్రతి ఒక్క ఓటరునీ కలవండి. వాళ్లతో మాట్లాడండి. అన్ని వర్గాల వారికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించండి. మనం అందరి నమ్మకాన్నీ గెలుచుకోవాలి. బీజేపీ కూటమికి 400 సీట్లు రావాలి. బీజేపీ 370 సీట్లు సాధించాలి. ఇదంతా జరగాలంటే నవభారత నిర్మాణం కోసం కలిసికట్టుగా పని చేయాలి"


- ప్రధాని నరేంద్ర మోదీ 
 






గత ఏడాదిన్నరగా సైలెంట్‌గా పని చేసుకుంటూ పోతున్నామని వెల్లడించారు ప్రధాని మోదీ. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పం అని స్పష్టం చేశారు. వికసిత్ భారత్‌కి తనదే గ్యారెంటీ అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం దేశం చాలా పెద్ద కలలు కంటోందని, వాటిని నిజం చేసుకుంటోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో వికసిత్ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని భరోసా ఇచ్చారు.