Russian Missile Attack: రష్యా- ఉక్రెయిన్ యుద్దంలో ఇప్పటికే ఎంతో మంది మరణించారు. రష్యా చేస్తోన్న భీకర దాడులను ఉక్రెయిన్ సైన్యం తిప్పికొడుతోంది. అయితే తాజాగా అందరి మనసులను కలచివేసే సంఘటన ఉక్రెయిన్‌లో జరిగింది. రష్యా చేసిన రాకెట్ దాడుల కారణంగా ఓ పసికందు మృతి చెందింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది.
ఇదీ జరిగింది
బుధవారం విల్నయాన్స్క్ నగరంలోని ఓ చిన్న ప్రసూతి వార్డుపై రష్యా బలగాలు పెద్ద రాకెట్లతో దాడి చేశాయి. ఈ దాడితో ఆ ప్రసూతి వార్డులో అప్పుడే శిశువుకు జన్మనిచ్చిన తల్లికి గర్భశోకమే మిగిలింది. రష్యా చేసిన దాడితో అప్పుడే ఈ ప్రపంచాన్ని చూసిన శిశువు ప్రాణాలు కోల్పోయింది. జపోరిజ్జీయా ప్రాంత మిలటరీ పరిపాలన విభాగం అధిపతి టెలిగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
విల్నయాన్స్క్.. ఉక్రెయిన్ అధీనంలో ఉన్న నగరం. జపొరిజ్జియాలోని అనేక ప్రాంతాల్ని రష్యా ఇప్పటికే ఆక్రమించుకుంది. అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తూ తమ భుభాగంగా పేర్కొంటుంది.
రష్యానే జవాబుదారి
హృదయం దుఃఖంతో నిండిపోయిందని, అప్పుడే పుట్టి ఈ ప్రపంచాన్ని చూసిన శిశువు మరణించడం నన్నూ కలిచివేసిందని జపొరిజ్జియా గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడి ఘటనను ఖండిస్తూ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్దం
ఫిబ్రవరి 24 న రష్యా.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రారంబించింది. గత తొమ్మిది నెలలుగా యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంది. ఇరు దేశాలకు తీవ్ర నష్టం జరగడంతోపాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.