Monkeypox Rename: 


పేరు మార్చకపోతే వివక్ష తప్పదేమో..


మంకీపాక్స్‌ పేరు మార్చాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు విజ్ఞప్తి చేసింది న్యూయార్క్‌ నగరం. అక్కడ మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం వల్ల ప్రజల్లో భయాందోళనలు తగ్గించేందుకు పేరు మార్చాలని సూచించింది. సరైన ఆరోగ్య రక్షణ లేని వాళ్లు, ఈ పేరుతో మరింత ఆందోళనకు గురవుతున్నారని న్యూయార్క్ అధికార యంత్రాంగం చెబుతోంది. అమెరికాలో ఎక్కడా లేని విధంగా, న్యూయార్క్‌లో వెయ్యికిపైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. "మంకీపాక్స్‌పై వస్తున్న వదంతులు, మెసేజ్‌లు ప్రజల్ని భయపెడుతున్నాయి. ఇది కచ్చితంగా దృష్టి సారించాల్సిన విషయం. ఇప్పటికే కొన్ని తెగలు రకరకాల వైరస్‌లు సోకి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిది కూడా తోడైంది. ఆయా వర్గాల ప్రజల ఆందోళన తగ్గించాల్సిన బాధ్యత ఉంది" అని న్యూయార్క్ సిటీ పబ్లిక్ హెల్త్ కమిషనర్ వెల్లడించారు. "మంకీపాక్స్ వైరస్‌ ఓ వర్గ ప్రజల నుంచే సోకుతుందన్న సమాచారంతో కొందరు వర్ణవివక్ష చూపించే ప్రమాదముంది. అందుకే మంకీపాక్స్ పేరు మార్చాలి" అని WHOకి రాసిన లెటర్‌లో ప్రస్తావించారు. 


తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి..


మంకీపాక్స్‌ వైరస్ కోతుల నుంచి రాలేదని, ఈ పేరుని అలాగే ఉంచటం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందనిఅంటోంది న్యూయార్క్ అధికార యంత్రాంగం. హెచ్‌ఐవీ వచ్చిన కొత్తలోనూ ఇలాంటి వదంతులే వ్యాపించటం వల్ల ఓ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపించారని గుర్తు చేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి చెందిన తొలి నాళ్లలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "చైనా వైరస్" అని పదేపదే విమర్శించారు. ఈ కారణంగా...పలు దేశాల్లోని ఏషియన్లు వివక్ష ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా "మంకీపాక్స్" పేరునే కొనసాగిస్తే...ఓ వర్గ ప్రజలు ఇదే తరహాలో వివక్షకు గురి అయ్యే ప్రమాదముందన్నది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో ఎండెమిక్‌గా మారిన మంకీపాక్స్ ఇప్పుడు యూరప్, అమెరికాలో వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో ఇద్దరు చిన్నారుల్లోనూ మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం అక్కడి అధికారులను ఆందోళనకు గురి చేసింది. ఇటు భారత్‌లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నలుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం..ఇవన్నీ మంకీపాక్స్ లక్షణాలే. ఈ వైరస్ సోకిన రెండ్రోజుల తరవాతఒంటినిండా దద్దుర్లు వస్తాయి. కొన్ని వారాల పాటు ఇవి ఇలాగే ఉండిపోతాయి. పురుషులు, పురుషులతో శృంగారంలో పాల్గొంటే, వారిలోనే ఎక్కువగా మంకీపాక్స్ వైరస్ ఉనికి కనిపిస్తోందని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని ఇటీవల స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించటం, భౌతిక దూరం పాటించటం లాంటివి చేస్తే...ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించింది. 


Also Read: APJ Abdul Kalam Death Anniversary: మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?