Nepal Plane Crash Reasons: 


రన్‌వే మార్చడం వల్లేనా..? 


నేపాల్ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదన్నది ఇప్పటికే తేలిన విషయం. కానీ...ఎందుకీ ప్రమాదం జరిగిందన్న సస్పెన్స్‌కు మాత్రం ఇంకా తెరపడలేదు. కొండ ప్రాంతం కాబట్టి వాతావరణం అనుకూలంగా లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని అనుకోవచ్చు. అయితే..విమానం క్రాష్ కావడానికి అది కారణం కాదని తేల్చి చెప్పారు అధికారులు. మరి ఈ ప్రమాదానికి కారణమేంటి..? ఈ ప్రశ్న ఆధారంగా విచారించగా కొన్ని కీలక విషయాలు తెలిశాయి. BBC రిపోర్ట్ ప్రకారం...పైలట్ ఉన్నట్టుండి రన్‌వేను మార్చాలనుకోవడమే ప్రమాదానికి దారి తీసినట్టు తెలుస్తోంది. ఫ్లైట్ ల్యాండింగ్‌కు క్లియరెన్స్ వచ్చింది. కానీ...అప్పటికప్పుడు పైలట్ రన్‌వేను మార్చాలనుకున్నాడు. ఆ కన్‌ఫ్యూజన్‌లోనే ఫ్లైట్ ఆల్టిట్యూడ్‌ కూడా మారిపోయింది. విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగిరినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు ఫ్లైట్ ఎలా అదుపు తప్పిందో స్థానికులు తీసిన వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం జనవరి 1నే ప్రారంభమైంది. ఇక్కడ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు తూర్పు, పడమర దిక్కుల్లో రెండు వేరు వేరు రన్‌వేలు నిర్మించారు. రన్‌వే-30 ని తూర్పు నుంచి వచ్చే విమానాలకు, రన్‌వే-12ని పడమర నుంచి విమానాల ల్యాండింగ్‌కు వినియోగిస్తారు. అయితే...ప్రమాదం జరిగే ముందు ఫ్లైట్‌కి రన్‌వే-30పై ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అనుమతినిచ్చారు. అంతలోనే పైలట్‌ రన్‌వే-12కు డైరెక్షన్ మార్చేసి అప్పటికప్పుడు పర్మిషన్ అడిగినట్టు సమాచారం. ఈ కన్‌ఫ్యూజన్ కారణంగానే క్రాష్ అయినట్టు తెలుస్తోంది. ఈ కారణాలతో పాటు టెక్నికల్‌గా ఏమైనా సమస్యలున్నాయా అన్న కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. కేవలం పైలట్‌ ఒత్తిడికి గురవడం వల్ల  ప్రమాదం జరిగిందా అన్నదీ ఆరా తీస్తున్నారు. ఏదైనా సరే..విచారణ తరవాతే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి. 


వైరల్ వీడియో..


ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. క్రాష్ అయ్యే ముందు ఓ వ్యక్తి తన ఇంటి డాబాపై నిలబడి  వీడియో తీసినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరగబోయే ఓ 15 సెకన్ల ముందు ఫ్లైట్ ఎలా అదుపు తప్పిందో ఈ వీడియోలో కనిపించింది. అన్ని చోట్లా ఈ వీడియో షేర్ అవుతున్నా...ఇది నిజమా కాదా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. విమానం గాల్లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఓ పక్కకు పూర్తిగా ఒరిగిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనబడింది. ఆ తరవాత పెద్ద శబ్దం కూడా వినిపించింది. ఈ ప్రమాదం జరిగిన తరవాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ 72 మందిలో 68 మందిప్రయాణికులు కాగా..మిగతా నలుగురు విమాన సిబ్బంది. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్, పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మధ్య ఫ్లైట్ క్రాష్ అయినట్టు Yeti Airlines వెల్లడించింది.