ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ తరపున జిల్లా మొత్తం కలియదిరిగే నాయకులు ఉన్నా కూడా ఇప్పుడు వారంత హుషారుగా లేకపోవడంతో కొత్తగా పార్టీలో చేరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి లీడ్ తీసుకుంటున్నారు. ఇటీవల వెంకటగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై దృష్టిసారించారాయన. ఆ మైనింగ్ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినా కూడా అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. ప్రభుత్వాన్ని చూసుకుని ఇబ్బందుల్లో పడొద్దని వార్నింగ్ ఇచ్చారు. 


"ఎమ్మార్వో గారూ..! ఈ ప్రభుత్వం ఉండేది 2 నెలలే.. మీ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది జాగ్రత్త" అంటూ ఫోన్ లో సైదాపురం ఎమ్మార్వోని హెచ్చరించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురం మండలంలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ చేస్తున్న ప్రాంతాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇతర నేతలు ఆయన వెంట ఉన్నారు. టీడీపీ నేతలు రావడంతో అక్కడ మైనింగ్ చేస్తున్న వారు వాహనాలు వదిలి పారిపోయారు. సంఘటనా స్థలం నుంచే ఆయన ఎమ్మార్వోకి ఫోన్ చేశారు. ఆ వ్యవహారాలకు దూరంగా ఉండాలని తమకు మౌఖిక ఆదేశాలున్నాయని ఎమ్మార్వో చెప్పడంతో కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో పడిపోయే ప్రభుత్వం గురించి మీరెందుకు ఇబ్బందుల్లో పడతారని ప్రశ్నించారు. 


వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న 9 మైనింగ్ మెషిన్లను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. సైదాపురం మండలం, పెరుమాళ్ళుపాడు గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ చర్యలు తీసుకోకపోతే హైకోర్టుని ఆశ్రయిస్తామని చెప్పారు. అక్రమ మైనింగ్ పై టీడీపీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. 


యథేచ్చగా క్వార్జ్ తవ్వకాలు
ఇటీవల కొంతకాలంగా జిల్లాలో అక్రమ క్వార్జ్ తవ్వకాలపై ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన నేత, వెంకటగిరి వైసీపీ ఇన్ చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. అక్రమ తవ్వకాలపై తాను అధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే ఈ వ్యవహారానికి ఓ మంత్రికి సంబంధం ఉందనే పుకార్లు ఉన్నాయి. స్వయానా మంత్రి ఈ తవ్వకాలకు సపోర్ట్ గా ఉన్నారని టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. దీంతో అధికారులు కూడా సైలెంట్ గా ఉన్నారు. తవ్వకాలవైపు వారు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం. 


అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ అండదండలు కూడా ఉండటంతో యథేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సడన్ గా వెళ్లడంతో గుట్టు బయటపడింది. తవ్వకాలు జరుపుతున్నవారు వాహనాలను వదిలేసి పరారయ్యారు. మొత్తం 9 వాహనాలను టీడీపీ నేతలు గుర్తించారు. వాటిని అటవీ అధికారులకు అప్పగించారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం వివరణ ఇవ్వకపోవడం విశేషం.