NCP reunion announcement mid February : అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లోని రెండు వర్గాలు మళ్ళీ ఒకటి కాబోతున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో, ఫిబ్రవరి రెండో వారంలో ఎన్సీపీ విలీనంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల పుణె మున్సిపల్ ఎన్నికల్లో శరద్ పవార్ , అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేయడం ఈ దిశగా తొలి అడుగుగా భావించగా, ఇప్పుడు పూర్తిస్థాయి విలీనానికి రంగం సిద్ధమైంది.
ఈ విలీన ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ జనవరి 28న బారామతి విమాన ప్రమాదంలో అకాల మరణం చెందడం పార్టీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ పవార్ మరణించినప్పటికీ, ఆయన చివరి కోరిక మేరకు రెండు వర్గాలను కలిపే ప్రక్రియను కొనసాగించాలని ఇరు పక్షాల నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5న జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం, విలీనంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ విడుదల కానుంది.
ఏకీకృత ఎన్సీపీకి నాయకత్వం వహించే విషయంలో ప్రస్తుతం నలుగురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మార్గదర్శకత్వంలో పార్టీ నడవనుండగా, అధ్యక్ష పీఠం రేసులో సుప్రియా సూలే , అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ , సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ , జయంత పాటిల్ ఉన్నారు. ముఖ్యంగా అజిత్ పవార్ పట్ల ఉన్న సానుభూతి పవనాలతో పాటు పార్టీ శ్రేణుల మద్దతు కూడా ఉండటంతో సునేత్రా పవార్ పేరు బలంగా వినిపిస్తోంది.
ఈ విలీనం జరిగితే మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అజిత్ పవార్ వర్గం అధికార మహాయుతి కూటమిలో ఉండగా, శరద్ పవార్ వర్గం ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ'లో ఉంది. విలీనం తర్వాత ఈ కొత్త పార్టీ ఏ కూటమితో ముందుకు వెళ్తుంది? లేదా స్వతంత్రంగా వ్యవహరిస్తుందా? అన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాబోయే వారం రోజుల్లో జరిగే ఉన్నత స్థాయి సమావేశాలు ఈ సందిగ్ధతకు తెరదించే అవకాశం ఉంది.
