Lok Sabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశకు జూన్ 1న ఓటింగ్ జరగనుంది. అంతకుముందు దేశవ్యాప్తంగా ఆరు దశల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఏడవ  దశ ఓటింగ్ తర్వాత శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పెద్ద ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి టీవీ ఛానళ్లలో చర్చలో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. జూన్ 1న ఎగ్జిట్ పోల్‌కు సంబంధించిన టెలివిజన్ ఛానెళ్లలో చర్చల్లో పాల్గొనబోమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. జూన్ 4 నుంచి జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొంటుందని పార్టీ మీడియా విభాగం అధినేత పవన్ ఖేడా ప్రకటించారు.  ఫలితాలకు ముందు (జూన్ 4) ఊహాగానాలలో మునిగిపోవాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదని, పవన్ ఖేడా ట్విట్టర్ లో రాబోయే ఎగ్జిట్ పోల్ డిబేట్లలో పాల్గొనకూడదనే పార్టీ నిర్ణయంపై పార్టీ ప్రకటనను రాసుకొచ్చారు.


ఈ సందర్భంగా పవన్ ఖేడా మాట్లాడుతూ, 'ఓటర్లు తమ ఓటు వేశారు. ఓటింగ్ ఫలితాలను మిషన్ లలో లాక్ చేశారు. జూన్ 4న ఫలితాలు అందరి ముందుకు రానున్నాయి.  ఫలితాలు వెలువడకముందే డిబేట్లలో పాల్గొని టీఆర్‌పీ గేమ్‌ ఆడడం కాంగ్రెస్‌ దృష్టిలో సమర్థనీయం కాదు. జూన్ 4 నుంచి మళ్లీ చర్చలో కాంగ్రెస్ పార్టీ సంతోషంగా పాల్గొంటుంది’ అన్నారు. శనివారం నాటికి చివరి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పూర్తికానున్న సంగతి తెలిసిందే. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.


ఎగ్జిట్ పోల్‌కు సంబంధించి ఈసీ  సూచనలు
ఎలక్ట్రానిక్, ప్రింట్, ఇతర అన్ని రకాల ప్రచార మాధ్యమాలకు ఎన్నికల సంఘం ప్రత్యేక సూచనలు చేసింది. శనివారం లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే వారు ఎగ్జిట్ పోల్‌లను ప్రసారం చేయవచ్చు. 18వ లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గత మార్చిలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను కమిషన్ ఉదహరించింది. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుండి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు అన్ని మీడియా ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేయకుండా నిషేధం ఉంటుందని తెలిపింది. శనివారం సాయంత్రం 6:30 గంటల వరకు అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్ ప్రచారంపై నిషేధం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.  






57లోక్ సభ స్థానాలకు ఎన్నికలు
 లోక్‌సభ ఎన్నికల చివరి దశ, ఏడు రాష్ట్రాలు,  ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఈ దశలో బీహార్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో పోలింగ్ జరుగుతోంది. ఈ దశ ఓటింగ్‌తో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన అన్ని దశల ఎన్నికల ఓటింగ్ పూర్తవుతుంది.  ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని స్థానాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే 486 లోక్‌సభ స్థానాలకు 6 దశల్లో ఓటింగ్ జరిగింది.