Madhya pradesh News: చేతిలో త్రివర్ణ పతాకం, ఆర్మీ యూనిఫారం, మా తుఝే సలామ్ పాట మోగుతోంది.  వేదికపై నుంచి చప్పట్ల మోత, సెల్యూట్ పెడుతూ వేదిక పైనే మాజీ సైనికుడు కుప్ప కూలాడు.  కింద పడుతున్నప్పుడు కూడా త్రివర్ణ పతాకాన్ని గౌరవించాడు. ఆ సమయంలో ఆ పతాకాన్ని మరొకరు ఎగుర వేశారు.  ఆ అద్భుత ప్రదర్శనలో చప్పట్లు మార్మోగాయి.  కానీ మాజీ సైనికుడు మాత్రం కింద పడుకునే ఉన్నారు.  జనాలంతా ఆయన అద్భుతంగా నటిస్తున్నాడని అనుకున్నారు. తన పరిస్థితిని పట్టించుకోలేదు.  


ఒక నిమిషం పాటు అలాగే ఉండిపోయే సరికి ఏమైందో అని దగ్గరకు వెళ్లి చూశారు. త్రివర్ణ పతాకాన్ని ఊపుతున్న వ్యక్తి అతడిని పరీక్షించాడు, అతని శ్వాసను తనిఖీ చేశాడు. మాజీ సైనికుడి శరీరంలో ఎలాంటి చలనం లేదు.   జనాలకు విషయం అర్థమయ్యే సరికి ఆ మాజీ సైనికుడి ప్రాణం పోయింది. యూనిఫాంలో ఉన్న ఓ మాజీ సైనికుడి తన చివరి శ్వాస వరకు త్రివర్ణ పతాకంతోనే ఉన్నాడు.  కానీ అతను పడిపోయినప్పుడు ప్రజలు పట్టించుకుని సీపీఆర్ చేసి  ఆస్పత్రికి తరలించి ఉంటే.. అతడి ప్రాణాలు నిలిచేవి. 


ఇండోర్ లో ఘటన
ఇండోర్‌లోని ఫూటీ కోఠి నుండి యోగా రంగంలో పనిచేస్తున్న ఒక సంస్థ గ్రాండ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది.  రిటైర్డ్ సైనికుడు బల్బిందర్ చావ్డా కూడా తన బృందంతో అదే కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చాడు. బల్బిందర్ చావ్డా తన బృందంతో కలిసి ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు వెళ్లి దేశభక్తి ప్రదర్శనలు ఇచ్చేవాడు. బల్బిందర్ చావ్డా ఇండోర్‌లోని తేజాజీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.






దేశభక్తి గీతాలతో ప్రదర్శన 
యోగా కార్యక్రమంలో చాలా మంది హాల్‌లో కూర్చున్నారు.  బల్బిందర్ చావ్డా ఇక్కడ ప్రదర్శన ఇస్తున్నాడు. కార్యక్రమంలో పలు దేశభక్తి గీతాలను ఏర్పాటు చేశారు. ఇందులో మేరీ ఆన్ తిరంగ హై, వందేమాతరం... వంటి దేశభక్తి గీతాలు ఉన్నాయి. బల్బిందర్ చావ్డా ఆర్మీ యూనిఫాం ధరించి వేదికపై దేశభక్తి గీతాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, అతను గుండెపోటుకు గురై వేదికపై కుప్పకూలిపోయాడు.


ప్రదర్శనలో భాగమే అనుకున్నారు  
గుండెపోటుతో బల్బిందర్ చావ్డా వేదికపై పడిపోయినప్పుడు.. అతను ప్రదర్శన ఇస్తున్నాడని..  వేదికపై పడటం అందులో భాగమనే  ప్రజలు భావించారు. ఆ తర్వాత ప్రజలు పెద్దగా చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు.  వేదిక కింద అతని మరో స్నేహితుడు కూడా ఉన్నాడు. కొంత సేపటికి బల్బిందర్ చావ్డా ఎలాంటి కదలికలు రాకపోవడంతో అతని స్నేహితుడు వెళ్లి పరిశీలించారు. బల్బిందర్ చావ్డా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.


ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి 
బల్బిందర్ చావ్డాను అతని సహచరులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం వెంటనే అతడికి చికిత్స ప్రారంభించేందుకు సిద్ధమైంది..  కానీ అప్పటికి బల్బిందర్ చావ్డా మృతి చెందాడు. పరీక్షల అనంతరం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రాథమిక విచారణ తర్వాత, బల్బిందర్ చావ్డా సైలెంట్ ఎటాక్ వల్లే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.