National Commission for Men Bill Introduced in Rajya Sabha :భారతదేశంలో పురుషుల హక్కులు, సంక్షేమం కోసం దీర్ఘకాలం నుంచి నడుస్తున్న పోరాటానికి పార్లమెంటరీ మార్గం సుగమమైంది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ డిసెంబర్ 6న 'నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్, 2025'ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. . ఇది ప్రైవేట్ మెంబర్ బిల్. సాధారణంగా ప్రైవేటు మెంబర్ బిల్లులు ఆమోదం పొందడం దాదాపుగా అసాధ్యం.
ఈ చట్టం ద్వారా పురుషుల హక్కులను కాపాడేందుకు స్వతంత్ర చట్టపరమైన సంస్థను ఏర్పాటు చేయాలని, లింగ-వివక్ష చూపని చట్టాలు అమలు చేయాలని, త్వరిత కోర్టులు, తప్పుడు కేసులకు కఠిన శిక్షలు విధించాలని ఎంపీ అశోక్ కోరుతున్నారు. భారతదేశంలో మహిళల హక్కుల కోసం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వంటి సంస్థలు ఉన్నప్పటికీ, పురుషుల సంక్షేమానికి ఎటువంటి ప్రత్యేక సంస్థ లేకపోవడంపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ప్రవేశ పెట్టిన ఈ బిల్, పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలైన ఆత్మహత్యల రేటు పెరగడం, సెక్షన్ 498A , తప్పుడు కేసులు, కుటుంబ కోర్టుల్లో ఆలస్యాలు వంటి అంశాలను చర్చించి పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డేటా ప్రకారం, భారతదేశంలో పురుషుల ఆత్మహత్యలు మహిళల కంటే ఎక్కువగా ఉన్నాయని, చట్టాలు లింగ-పక్షపాతంతో ఉన్నాయని అశోక్ కుమార్ వాదిస్తున్నారు. బిల్ ప్రధాన లక్ష్యాలు: నేషనల్ కమిషన్ ఏర్పాటు : పురుషుల హక్కులు, సంక్షేమం కోసం స్వతంత్ర చట్టపరమైన సంస్థను ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ ఫిర్యాదులు వినడం, చట్టాల సమీక్ష, విధాన సలహాలు ఇవ్వడం వంటి బాధ్యతలు చేపట్టాలి. లింగ-నిరపేక్ష చట్టాలు : ఇప్పటి చట్టాల్లో (ఉదా: IPC సెక్షన్ 498A, డొమెస్టిక్ వయాలెన్స్ యాక్ట్) ఉన్న లింగ పక్షపాతాన్ని తొలగించి, సమాన రక్షణ అందించాలి. త్వరిత కోర్టులు : పురుషులపై తప్పుడు కేసులు, కుటుంబ వివాదాలకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, విచ్ఛేదన, కస్టడీ కేసుల్లో ఆలస్యాలను తగ్గించాలి. తప్పుడు కేసులకు కఠిన శిక్షలు : తప్పుడు ఆరోపణలు చేసినవారికి జరిమానాలు, జైలు శిక్షలు విధించాలి. ఇది సెక్షన్ 498A దుర్వినియోగం చేయడం ఆపుతుందని అంటున్నారు. ఇతర సలహాలు : పురుషుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ, కుటుంబ సంక్షేమ విధానాల సమీక్ష.
ప్రైవేట్ మెంబర్ బిల్‌ల ప్రక్రియ ప్రకారం, దీనిపై చర్చలు, ఓటింగ్ కోసం నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. అందుకే ఇది చట్టంగా మారుతుందని ఎవరూ అనుకోవడంలేదు. కానీ సోషల్ మీడియాలో చర్చ ప్రారంభించడానికి కారణం అవుతోంది. పార్లమెంట్లో అత్యధికంగా మగ ఎంపీలే ఉన్నారు. వారందరూ కావాలనుకుంటే.. బిల్లుపాస్ అవుతుంది. కానీ రాజకీయ కారణాలతో బిల్లు చర్చకు రావడం కూడా కష్టమేనని భావిస్తున్నారు.