తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వారి సమస్యలపై ప్రభుత్వం కొంచెం కూడా శ్రద్ధ పెట్టడం లేదని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వర్కర్లను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లిపోవడం, బస్సులు ఎక్కించి తరలించడంపై లోకేశ్ స్పందించారు. ఇలా ఉక్కుపాదం మోపడం జగన్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. విజయవాడ ధర్నాచౌక్ లో నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అడ్డగోలుగా పీకేసి, అంగన్వాడీలను అక్రమంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో తీసుకెళ్లారని, ఇలా అరెస్టు చేయడం జగన్ నియంతృత్వానికి నిదర్శనం అని అన్నారు. ఈ మేరకు లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.


‘‘15 రోజులుగా తమ న్యాయబద్ధమైన డిమాండ్లపై పోరాడుతున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై వైసీపీ ప్రభుత్వం కొంచెం కూడా శ్రద్ధ పెట్టలేదు. వేతనాలు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత వంటి పలు అంశాలను కోరుకున్న అంగన్వాడీలపై కర్కశత్వాన్ని ప్రదర్శించడం దుర్మార్గం. హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలపై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపడం నిరంకుశత్వమే. శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ.. తమ డిమాండ్లపై ప్రజా ప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అంగన్వాడీలకు లేవా? విజయవాడ ధర్నాచౌక్ లో నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అడ్డగోలుగా పీకేసి, అంగన్వాడీలను అక్రమంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో పడేసి అరెస్టు చేయడం జగన్ నియంతృత్వానికి నిదర్శనం. అంగన్వాడీ సోదరీమణుల న్యాయబద్ధమైన పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్ధతు ఉంటుంది. అంగన్వాడీ సోదరీమణుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని నారా లోకేష్ అన్నారు.