Lokesh Comments in Mangalagiri: మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని, మీ ఇంటి బిడ్డలా భావించి రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని యువనేత నారా లోకేష్ మంగళగిరి ప్రముఖులను అభ్యర్థించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రాజకీయాలకు సంబంధం లేని వివిధరంగాల ప్రముఖులను గత 3 రోజులుగా యువనేత లోకేష్ కలిసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. మూడో రోజైన శుక్రవారం (డిసెంబర్ 29) మంగళగిరి పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థోడెంటిస్ట్ మాజేటి వంశీకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ కక్కోలు సత్యనారాయణరావు, ప్రముఖ చేనేత వస్త్రవ్యాపారి తుమ్మా సత్యనారాయణలను కలిశారు. తొలుత మంగళగిరి కొత్తపేటలోని మాజేటి వంశీకృష్ణ నివాసానికి వెళ్లిన లోకేష్ కు సాదర స్వాగతం పలికారు.
వంశీకృష్ణ రెండు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ నెలకొల్పి సేవలందిస్తుండగా, వారి కుటుంబసభ్యులు దశాబ్ధాలుగా మంగళగిరిలో ఆయిల్ మిల్స్, హోటల్స్, పెట్రోలు బంకులు నిర్వహిస్తున్నారు. హాస్పటల్స్, వ్యాపారాల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న లోకేష్... 3 నెలల్లో రాబోయే ప్రజా ప్రభుత్వం స్వేచ్చాయుత వాతావరణంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వివిధరకాల వ్యాపారాల ద్వారా పదిమందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర వహించే వారిని ప్రభుత్వం ప్రోత్సహించాల్సి ఉందని తెలిపారు. అనంతరం ప్రముఖ వైద్యుడు కక్కోలు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
గత 40 ఏళ్లుగా మంగళగిరిలో నివాసముంటున్న సత్యనారాయణ కుటుంబం పట్టణంలో భవానీ నర్సింగ్ హోమ్ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. ఆర్థికస్థోమత లేని పేదలకు ఉచితంగా వైద్యసేవలతోపాటు మందులు అందించడం అభినందనీయమని లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సత్యనారాయణ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. చివరగా మంగళగిరి 25వవార్డుకు చెందిన టివిఆర్ హ్యాండ్లూమ్స్ అధినేత తుమ్మా వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబసభ్యులను నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
మంగళగరి పట్టణంలో చేనేతలు, మాస్టర్ వీవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు – పరిష్కార మార్గాలను లోకేష్ తెలుసుకున్నారు. మంగళగిరిలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి తాము ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు యువనేత సందర్భంగా తెలిపారు. ఓడినా నాలుగున్నరేళ్లుగా తాను మంగళగిరిలోనే ఉంటూ వివిధ వర్గాల ప్రజలకు తమవంతు సేవలందిస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి, నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి సహకరించాల్సిందిగా లోకేష్ కోరారు.