నాందేడ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో మరణ మృదంగం మోగుతోంది. ఇటీవల ఆస్పత్రిలో గడచిన 48 గంటల్లో 31 మంది మృతి చెందిన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గడచిన వారం లోజుల్లో 108 మంది రోగులు మృతి చెందారు. గడచిన 24 గంటల్లోనే 11 మంది మృతిచెందగా.. వీరిలో ఒక పసికందు కూడా ఉండటం విచారకరం. మృతుల్లో కొందరు పాము కాటుకు గురైనవారు కాగా మరికొందరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారున్నారని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు.
అక్టోబర్ నెల ఆరంభంలోనే ఈ ఆస్పత్రిలో 24 గంటల్లో 24 మంది మరణించిన విషయం తెలిసిందే. వారిలో 12 మంది శిశువులు ఉన్నారు. మందుల కొరత, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆస్పత్రిలో రోగులు మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
చివరి దశలో రోగులు వచ్చారు'
అయితే, ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం జరిగిందనే ఆరోపణలను ఆస్పత్రి డీన్ శ్యామ్‌రావు తోసిపుచ్చారు. మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ రోగులు స్పందించటం లేదన్నారు. చాలా మంది రోగులు చివరి దశలో ఆసుపత్రికి వచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేషెంట్స్ వచ్చారని చెప్పారు. రోగులను రక్షించడానికి ఆస్పత్రి వైద్యులు సాయశక్తులా కృషి చేస్తున్నారని డీన్ వివరించారు.
ఆస్పత్రిలో జరుగుతున్న వరుస మరణాలపై డీన్ శ్యామ్ వాకోడే మాట్లాడుతు.... " మా హాస్పిటల్లో ఔషధ నిల్వలు సరిపడా ఉన్నాయి. మేము మూడు నెలలకు సరిపడా ఔషధాలను అందుబాటులో ఉంచుతాం. సిబ్బంది కూడా రోగులకు అన్నివేళల చికిత్స అందిస్తున్నారు. ఔషధాల కొరత కారణంగా ఏ రోగి కూడా ప్రాణాలు కోల్పోవట్లేదు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే చనిపోతున్నారు. ఇక మరణించిన చిన్నారులలో కొంతమందికి పుట్టుకతోనే వచ్చిన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి" అని తెలిపారు.
ఘటనపై విచారణకు కమిటీ
నాందేడ్ మరణాలపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంబంధిత ఆస్పత్రిని సందర్శించి పూర్తి పరిస్థితులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి ఓ సమగ్ర నివేదిక అందించనుంది. మరోవైపు ఏక్‌నాథ్ శిందే సర్కార్‌పై విపక్షాలు ఎదురుదాడి చేశాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని మండిపడ్డాయి.
ఒక్కరోజులో 14 మంది మృతి
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని ఘాటీ ప్రభుత్వాస్పత్రిలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. గత 24 గంటల్లో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఆస్పత్రిలో మందుల కొరత వల్లే రోగులు మరణించారన్న ఆరోపణలను జిల్లా ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది.
ఈ వరుస ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ప్రతిపక్షనేత అంబాదాస్ దాన్వే డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేత అంబాదాస్ దాన్వే మాట్లాడుతూ... " గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్పత్రికి కావాల్సిన మందులు సకాలంలో అందడం లేదు. దీంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలు బలవుతున్నారు. మందుల కొరత కారణంగా ఆస్పత్రి వర్గాలు రోగి బంధువులను మందుల కోసం ప్రైవేటు మెడికల్ షాపులకు పంపుతున్నాయి. బయట వేల రూపాయలు పెట్టి మందులు కొనలేక కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి." అని చెప్పారు.
నాందేడ్ ఆసుపత్రిలో నవజాత శిశువులు, రోగులు మృతి చెందడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అటు జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.