రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల తరపున శరద్ పవార్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ తరపున ఎవరు రాష్ట్రపతి అభ్యర్థి అవుతారో చివరి క్షణం వరకూ తెలియదు. మోడీ, అమిత్ షా ఎలాంటి సమీకరణాలను చూసుకుంటారో దాన్ని బట్టి అభ్యర్థి ఖరారు అవుతారు. అయితే.. తన తరపున ఓ అభ్యర్థిని ప్రకటించారు చిరంజీవి సోదరుడు.. ప్రముఖ నటుడు కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు. ఆయనపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చాలా నిక్కచ్చిగా చెప్పి.. దేశానికి ఆయన అవసరం ఉందని తేల్చేశారు. 
 
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని... ఇలాంటి సమయంలో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలి అని.. దానికి రతన్ టాటా అయితే సరైన వ్యక్తి అని నాగబాబు ప్రకటించారు. దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయని.. 0లాంటి సమయంలో తదుపరి రాష్ట్రపతి రాజకీయ ఎత్తుగడలను వ్యూహాలను రచించే వ్యక్తి కాకుండ దేశాన్ని తన కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుందనేది నాగబాబు అభిప్రాయం. భారతదేశ తదుపరి రాష్ట్రపతిగా నేను ప్రపోజ్‌ చేసే వ్యక్తి రతన్‌టాటా గారు. మీరేమంటారు.. అని ప్రజలకు చాయిస్ ఇచ్చారు. దీనికి RatanTataforPresident హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు.  


రతన్ టాటా అంటే నాగబాబుకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. బహుశా ఆయన విలువలు కలిగిన పారిశ్రామికవేత్త కావడం కావొచ్చు.. లేకపోతే అపరకుబేరుడైనప్పటికీ.. ఆయన నిరడంబరమైన జీవితం నచ్చి ఉండవచ్చుకానీ.. రతన్ టాటా గురించి సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతూనే ఉంది. అయితే ఈ సారి ఏకంగా రాష్ట్రపతి పదవికే నాగబాబు నామినేట్ చేశారు. ప్రజల మద్దతు కోసం అడుగుతున్నారు. నాగబాబు ట్వీట్ వైరల్ అయితే..  దేశం మొత్తం ఆ ప్రభావం కనిపిస్తోంది. దేశ ప్రజలు ఎక్కువ మంది మద్దతు పలికితే.. ప్రభుత్వాలు కూడా ఆయననే రాష్ట్రపతి చేయడానికి వెనుకాడవు . ఆ దిశగా నాగబాబు తన వంతు ప్రయత్నం తాను చేశారు. 


రతన్ టాటా ప్రస్తుతం టాటా గ్రూప్‌ రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్రపతి పదవిపై ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ..  నాగబాబు మాత్రం ముందుగా ప్రమోట్ చేయడం ప్రారంభించారు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ రతన్ టాటా అభ్యర్థిత్వంపై చర్చ జరిగితే.. ఆయన కన్నా గొప్ప అభ్యర్థి ఉండరని అంచనాకు వస్తారని నాగబాబు ఆలోచన. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదని ఎక్కువ మంది ప్రజలు భావిస్తారు. ఎందుకంటే రతన్ టాటా అంత స్వచ్ఛమైన వ్యక్తి మరి.