ఇటీవల గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ జనసేన డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. రోడ్లపై ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో తెలిసేలా ఫొటోలు తీసి మరీ వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ జతచేసి మరీ ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టారు జనసేన నేతలు. నాలుగు రోజులపాటు బాగా హడావిడి జరిగింది, ఆ తర్వాత కాస్త చప్పబడింది. అయితే నెల్లూరులో దీనికి కౌంటర్ గా నాయకులు కార్పొరేషన్ ద్వారా నాడు-నేడు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో రోడ్లపై గుంతలు ఎలా ఉన్నాయి, మరమ్మతుల తర్వాత ఆయా రోడ్లు ఎలా మారిపోయాయి అనే విషయంపై ఫొటో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. 


ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతు పనులను అత్యంత వేగంగా పూర్తి చేశామంటున్నారు అధికారులు. దీనికోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను వేగంగా పూర్తి చేసి, ప్రజా రవాణాకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు నగర కమిషనర్ జాహ్నవి పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా వివిధ డివిజనుల్లో రోడ్లపై ఏర్పడిన గుంతల రిపేరు పనుల అభివృద్ధిని ఫోటోల రూపంలో ప్రదర్శిస్తూ చేపట్టిన ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. 




 'రోడ్లపై గుంతలు నాడు - నేడు' అనే పేరుతో ఈ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. 'గుంతల రహిత రోడ్ల నిర్మాణం' కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారుగా 7 కోట్ల రూపాయలతో వివిధ డివిజనుల్లో 1600 గుంతలకు మరమ్మతులు పనులు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు కమిషనర్ జాహ్నవి. ప్రారంభించిన పనులన్నీ అన్ని ప్రాంతాల్లో దాదాపుగా 90 శాతం వరకు పూర్తయ్యాయని, వాహనదారులకు ఇబ్బంది లేకుండా దెబ్బతిన్న రోడ్లను తీర్చిదిద్దుతున్నామని కమిషనర్ వివరించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై 500 గోతులను గుర్తించామని, వర్షాకాలపు పరిస్థితుల దృష్ట్యా మరో నెల రోజుల అనంతరం వాటి మరమ్మతు పనులు చేడతామని చెప్పారు. నెల్లూరు నగరంలో ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు కమిషనర్ జాహ్నవి. 




రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన మరమ్మతు పనులకు సంబంధించి పూర్తి సర్వే నివేదికను సంబంధిత శాఖకు అందజేసామని, ఆ శాఖ ద్వారా పనులు పూర్తయితే 'గుంతల రహిత రోడ్ల నగరం'గా నెల్లూరు గుర్తింపు పొందుతుందని ఆమె చెప్పారు. ఈ ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. జనసేన డిజిటల్ క్యాంపెయిన్ కి కౌంటర్ గా ఇలా అన్నిచోట్ల ఫొటో ఎగ్జిబిషన్లు మొదలు పెట్టేలా ఉన్నారు నాయకులు.