Muslim Man Can Have Multiple Wives : ముస్లిం వ్యక్తులు ఒకరి కంటే ఎక్కువ భార్యలను చేసుకోవడంపై అలహాబాద్ హైకోర్టు ఆసక్తికర తీర్పు ఇచ్చింది. ఫుర్కాన్ అనే వ్యక్తిపై బహుభార్యాత్వం . అత్యాచార ఆరోపణలకు సంబంధించి కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణ జరిపిన జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ బెంచ్ కీలక రూలింగ్ ఇచ్చింది.
ఫుర్కాన్‌పై అతని రెండో భార్య తనకు మొదటి వివాహం గురించి చెప్పలేదని, అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసి కేసు పెట్టింది. కోర్టు, రెండో వివాహం చెల్లుబాటు అని అత్యాచార ఆరోపణలు నిలబడవని తీర్పు ఇచ్చింది. ఇద్దరూ ముస్లింలు , షరియత్ చట్టం ప్రకారం వివాహం జరిగింది కాబట్టి ఈ తీర్పు చెప్పింది. అయితే కోర్టు ఈ విషయంపై మరింత విచారణ అవసరమని, ఫిర్యాదిదారుకు నోటీసు జారీ చేసి, ఫుర్కాన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
ముస్లిం పురుషులు మహమ్మదీయ షరియత్ చట్టం ప్రకారం ఒకరి కంటే ఎక్కువ భార్యలను చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ వ్యక్తి అందర్నీ సమంగా న్యాయంగా చూసుకోవాలన్నారు. ఖురాన్‌లో సూరా 4, ఆయత్ 3 ప్రకారం, బహుభార్యాత్వం నిర్దిష్ట షరతులతో అనుమతించారని.. ఇది అనాథలు, వితంతువుల రక్షణ కోసం చారిత్రక సందర్భంలో అనుమతించారని కోర్టు తీర్పులో తెలిపింది.
ఖురాన్‌లో బహుభార్యాత్వం ఒక నిర్దిష్ట ఉద్దేశంతో అనుమతించినప్పటికీ చాలా మంది పురుషులు దీనిని "స్వార్థపరమైన కారణాల" కోసం దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. బహుభార్యాత్వం అనేది అపరిమిత హక్కు కాదని స్పష్టం చేసింది. భార్యలకు సమాన న్యాయం చేయగల సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే దీనికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
షరియత్ చట్టం కింద జరిగిన వివాహాలు ఐపీసీ సెక్షన్ 494 కింద నేరంగా పరిగమించవని కోర్టు తెలిపింది. ఆ వ్యక్తి మొదటి వివాహం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ యాక్ట్ లేదా ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగి .. తర్వాత ఇస్లాంలోకి మారి మహమ్మదీయ చట్టం ప్రకారం రెండో వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు కాదని కోర్టు స్పష్టం చేసింది. అలా చేయడం నేరం అని తెలిపింది.
బహుభార్యాత్వం దుర్వినియోగాన్ని గమనించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది. ముస్లిం వివాహాల చెల్లుబాటును ఫ్యామిలీ కోర్టులు నిర్ణయించగలవని, ఇది షరియత్ యాక్ట్ కంటే పవర్ ఫుల్ అని కోర్టు తెలిపింది.