Mumbai Airport: 


ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఘటన..


ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెకింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అధికారులు. బరువు కాస్త ఎక్కువైనా సరే...అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. కొందరు విదేశాల నుంచి పరిమితికి మించి వస్తువులు పట్టుకొస్తారు. కస్టమ్స్‌ అధికారులు ఫైన్‌ వేసి వాటిని రిలీజ్ చేస్తారు. అయితే...ఈ ఫైన్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ పెద్ద అబద్ధమే ఆడింది. మొత్తం అధికారులను టెన్షన్ పెట్టింది. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ఓ మహిళ లగేజ్‌ని చెకింగ్ చేసింది సిబ్బంది. బ్యాగేజ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ మేరకు డబ్బులు అదనంగా చెల్లించాలని అధికారులు చెప్పారు. డబ్బలు కట్టేందుకు మనసొప్పని ఆ మహిళ తన బ్యాగ్‌లో బాంబ్ ఉందని హడలెత్తించింది. ఒక్కసారిగా సెక్యూరిటీ స్టాఫ్‌ని పరుగులు పెట్టించింది. బ్యాగ్‌ చెక్‌ చేసిన తరవాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆమె చెప్పినట్టు అందులో  బాంబు లేదు. కేవలం డబ్బులు కట్టకుండా ఉండటానికి నోటికొచ్చింది చెప్పింది ఆ మహిళా ప్యాసింజర్. సీరియస్ అయిన అధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మే 29వ తేదీన ఈ ఘటన జరిగింది. సౌత్ ముంబయిలో ఉంటున్న ఆ మహిళ..భర్త, పిల్లలతో పాటు కోల్‌కత్తాకు వెళ్లాల్సి ఉంది. చెకిన్ కౌంటర్ వద్దకు వచ్చాక తన బ్యాగ్‌లను, బోర్డింగ్‌ పాస్‌ని అక్కడి సిబ్బందికి అప్పగించింది. ఎయిర్‌లైన్స్ నిబంధనల ప్రకారం ఒక్కో బ్యాగ్ బరువు 15 కిలోలు మాత్రమే ఉండాలి. అయితే...ఆ మహిళ రెండు బ్యాగ్‌లు కలిపి 22 కిలోలపైనే ఉన్నాయి. ఈ ఎక్స్‌ట్రా బ్యాగేజీకి డబ్బులు చెల్లించాలని సిబ్బంది చెప్పింది. "కట్టనంటే కట్టను" అని మహిళా ప్యాసింజర్ వాగ్వాదానికి దిగింది. ఆ తరవాతే బాంబు ఉందంటూ డ్రామా ఆడింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆమెపై FIR నమోదైంది. 


క్యారీ బ్యాగ్‌లో పాము..


అమెరికాలోని ఓ ఎయిర్‌ పోర్ట్‌లో చెక్‌ ఇన్‌ వద్ద ఓ మహిళ బ్యాగ్‌ను తనిఖీ చేసిన అధికారులు షాక్ అయ్యారు. తన క్యారీబ్యాగ్‌లో పాముని పట్టుకొచ్చింది. ఫ్లైట్‌తో తనతో పాటు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ...అధికారుల చెకింగ్‌తో అందుకు బ్రేక్ పడింది. అమెరికాలోని టంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందీ ఘటన. ఆమె క్యారీబ్యాగ్‌లో నాలుగు అడుగుల పాముని గుర్తించారు. ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ 
సిబ్బంది ఆ బ్యాగ్ స్కానింగ్ ఫోటోను కూడా షేర్ చేశాయి. అందులో చాలా స్పష్టంగా పాము కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. షూ, ల్యాప్‌టాప్‌తో పాటు పాము అందులో కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ కూడా పెట్టింది. "ఈ బ్యాగ్‌లో ప్రమాదకరమైన పాము ఉంది. ఎక్స్‌రే మెషీన్‌తో స్కాన్‌ చేసినప్పుడు ఇది తెలిసింది" అని తెలిపింది. ఇదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌కు పెట్స్‌ను తీసుకొచ్చే విషయంలో నియమ నిబంధనలు మరోసారి గుర్తు చేసుకోవాలని సూచించింది. చాలా చోట్ల పాముల్ని క్యారీ బ్యాగ్‌లలో పెట్టుకుని తీసుకురావడంపై ఆంక్షలు విధిస్తారు. ఒకవేళ అవి హానికరం కావు అని తెలిస్తేనే అనుమతినిస్తారు.


Also Read: Indian Railways: రైలు ఎక్కగానే ఇట్టే నిద్ర పట్టేస్తుంది. ఎందుకో తెలుసా?