రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించనందున ఆయనపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వ సీఎస్‌ను ఆదేశించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును కోరారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై ‘ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (ప్రవర్తన)’ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. అధికార వైఎస్సార్‌సీపీ, ప్రభుత్వం తరఫున పత్రికా ప్రకటనలు, సమావేశాలు చేయకుండా సజ్జలను నిలువరించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు. ఈ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సజ్జలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Continues below advertisement


ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించే న్యాయవాది హాజరు కాకపోవడంతో విచారణను వారం పాటు వాయిదా వేయాలని మరో న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం.. విచారణను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. 


సజ్జల రాజకీయ పాత్ర పోషిస్తున్నారు..
రఘురామ కృష్ణరాజు తన పిటిషన్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి గురించిన పలు విషయాలను ప్రస్తావించారు. సజ్జల వైఎస్సార్‌సీపీకి చెందినవారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉండటంతో పాటు ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, మరో 3 జిల్లాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారని చెప్పారు. పార్టీ తరఫున ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో రాజకీయ పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. సజ్జలను ప్రజా సంబంధాల సలహాదారుగా నియమిస్తూ 2019 జూన్‌ 18న రాష్ట్ర ప్రభుత్వం జీవో 131 జారీ చేసిందని గుర్తు చేశారు.


ఈ పదవి ద్వారా ఆయనకు కేబినెట్‌ మంత్రి హోదా కల్పించిందని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఈ నియామకం చేసేటప్పుడు పలు నిబంధనలు ఉంటాయని అన్నారు. వీటి ప్రకారం.. సివిల్‌ పోస్టులో ఉంటూ, ప్రభుత్వ జీతం, ఇతర ప్రయోజనాలు పొందుతున్న వ్యక్తికి ‘ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (ప్రవర్తన)’ నిబంధనలు వర్తిస్తాయని ఉద్ఘాటించారు. సదరు ఉద్యోగి ప్రభుత్వ మద్దతుగా వ్యవహరించకూడదని, నిబంధన 3 ప్రకారం నిర్దిష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పారు. ప్రత్యేక సలహాదారులు అంటే సివిల్ సర్వెంట్ల (తాత్కాలిక) లాంటి వారని.. వీరు నిజాయతీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆయనపై చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. 


Also Read: Horoscope Today :ఇవాళ ఈ రాశుల వారు శుభవార్త వింటారు, ఆ రాశుల ఉద్యోగులకు అంతా శుభసమయమే..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!


Also Read: Gold Silver Price, 9 September 2021: పసిడి ప్రియులకు ఈ రోజు కూడా శుభవార్త..నిన్నటి కన్నా మరింత తగ్గిన బంగారం ధర