Mohanlal Visits Wayanad: వయనాడ్‌లోని సహాయక చర్యల్లో మలయాళం సూపర్ స్టార్ మోహన్‌ లాల్ (Wayanad Tragedy) పాల్గొన్నారు. గౌరవ లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో ఆయన వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. 122  ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌తో పాటు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మందక్కై టెరిటోరియల్ ఆర్మీ బేస్‌ క్యాంప్‌నీ సందర్శించారు. కొజికోడ్ నుంచి వయనాడ్‌కి రోడ్డు మార్గంలో వెళ్లిన మోహన్‌ లాల్ అక్కడి ఆర్మీ అధికారులతో మాట్లాడారు. సహాయచర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.




ఆర్మీ అధికారులతో చర్చించిన తరవాత మందక్కైలో పర్యటించారు. మందక్కైతో పాటు పుంచిర్‌మట్టోమ్ ప్రాంతంలోనూ పర్యటించారు. మందక్కైలో దాదాపు పది నిముషాల పాటు గడిపారు. 2009లో మోహన్‌లాల్‌కి లెఫ్ట్‌నెంట్ కల్నల్ పోస్ట్‌ ఇచ్చారు. ఈ విషాదం తీవ్రతను అర్థం చేసుకునే ఇక్కడికి వచ్చినట్టు వెల్లడించారు మోహన్ లాల్. ఎక్కడ చూసినా బురదే కనిపిస్తోందని, ఎంత మంది చిక్కుకుపోయారో అంచనా వేయలేకపోతున్నారని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పారు. (Also Read: Kerala Tragedy: వయనాడ్ విలయంలో ఆసక్తికర ఘటన, ప్రాణాలు కాపాడిన గజరాజు - రాత్రంతా బాధితులకు అండగా కాపలా)






"ఈ విషాదం తీవ్రత ఏంటో అర్థం చేసుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. అన్ని చోట్లా భారీ ఎత్తున బురద పేరుకుపోయింది. దాని కింద ఎంత మంది చిక్కుకున్నారో అంతు తేలడం లేదు. సహాయక చర్యలు చేపడుతున్న వాళ్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భారత్‌లో ఎప్పుడూ చూడని అతి పెద్ద విపత్తు ఇది. సాధారణ స్థితికి తీసుకురాలేని స్థాయిలో విధ్వంసం జరిగింది. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు రాకుండా ఎలా జాగ్రత్తపడాలనేది ఆలోచించాలి"


- మోహన్ లాల్, మలయాళ నటుడు


 






ఐదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కనీసం 300 మంది గల్లంతయ్యారని (Wayanad Death Toll) అధికారులు చెబుతున్నారు. ఎక్కడికక్కడ తాత్కాలిక వంతెనలు నిర్మించి బాధితులను రక్షిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్‌. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెస్క్యూ ఆపరేషన్‌పై ఆరా తీస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారులతో భేటీ అయ్యారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.లక్ష విరాళం అందించారు విజయన్. ఆయన సతీమణి టీకే కమల రూ.33 వేలు విరాళం ఇచ్చారు.


Also Read: Kerala Tragedy: వయనాడ్ విలయంలో ఆసక్తికర ఘటన, ప్రాణాలు కాపాడిన గజరాజు - రాత్రంతా బాధితులకు అండగా కాపలా