క్వాడ్ సదస్సు ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్ పయనం కానున్నారు. ఐరాస 76వ జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.
శ్వేతసౌధంలో దాదాపు 4 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన 'క్వాడ్' దేశాధినేతల సదస్సు ముగిసింది. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ఐకమత్యంగా కృషిచేయాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది. వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించింది.
" 2004లో వచ్చిన సునామీ తర్వాత మన నాలుగు దేశాలు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇప్పుడు కరోనా సంక్షోభంలో మళ్లీ భేటీ అయ్యాం. ప్రపంచ శ్రేయస్సుకోసమే ఈ సమావేశం. క్వాడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఇండో-పసిఫిక్ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్ మరింత ముందుకు వెళ్లాలి. సప్లై చైన్, ప్రపంచ భద్రత, వాతావరణ మార్పులు, కొవిడ్‌పై యుద్ధం సహా పలు అంశాలపై నా స్నేహితులతో మాట్లాడటం ఆనందంగా ఉంది. "
శ్వేతసౌధంలో క్వాడ్ సదస్సు మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగా సమావేశంలో పాల్గొన్నారు.
" ఈరోజు జరిపిన ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యం. ఈ శతాబ్దంలో మూడో దశాబ్దం మొదట్లోనే మన చర్చలు జరిగాయి. మీ నాయకత్వం.. ఈ దశాబ్దంలో కీలక మార్పులు తెస్తుందని నమ్ముతున్నాను. భారత్- అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేద్దాం. ప్రస్తుతం సాంకేతికత ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఆ సాంకేతికత సాయంతో మనం మరింత ముందుకు సాగాలి. "
" అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్- అమెరికా బంధం చాలా ముఖ్యం. 2020 నాటికి భారత్, అమెరికా మధ్య బలమైన స్నేహం ఏర్పడుతుందని నేను 2006లో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే చెప్పాను. "
ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు బైడెన్ ట్వీట్ చేశారు.
" ప్రధాని నరేంద్ర మోదీతో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నాను. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తాను. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని సురక్షితంగా ఉచ్చేందుకు అవసరమైన చర్యలపై చర్చిస్తాను. కొవిడ్-19, వాతావరణ మార్పులపైనా అభిప్రాయాలు పంచుకుంటాం. "
ప్రధాని మోదీ- బైడెన్ భేటీ నేపథ్యంలో ప్రధానికి స్వాగతం పలికేందుకు శ్వేతసౌధం బయట పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చేరుకున్నారు. భారత సంస్కృతిని చాటి చెప్పే సంప్రందాయ వస్త్రధారణలో నృత్యాలు చేస్తున్నారు.
Background
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ కానున్నారు. తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిణామాలపై ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.
వాణిజ్యం,పెట్టుబడి సంబంధాల బలోపేతం, రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు శ్వేతసౌధ అధికారులు ప్రకటించారు. ఈ భేటీకి మోదీతోపాటు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హాజరుకానున్నారు.
8.30 PM (IST): ప్రధాని నరేంద్ర మోదీ- బైడెన్ మధ్య దాదాపు గంటపాటు ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
11.30 PM IST (Sept 24) to 3.30 AM (Sept 25): ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాల కూటమి 'క్వాడ్' దేశాధినేతల మధ్య శ్వేతసౌధంలో దాదాపు 4 గంటలపాటు ఈ సమావేశం జరగనుంది.