Modi Surname Row:
2019లో పిటిషన్
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై పట్నా కోర్టులో హాజరు కానున్నారు. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్ విచారణకు రాహుల్‌కు నోటీసులు పంపింది కోర్టు. ఈ మేరకు ఆయన విచారణకు రానున్నారు. 2019లో అప్పటి బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే రాహుల్‌పై దాదాపు 6 పరువు నష్టం దావా కేసులు నమోదయ్యాయి. వరుసగా వీటిపై విచారణ జరుగుతోంది. ఇటీవలే సూరత్ కోర్టులో విచారణ పూర్తైంది. రాహుల్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఆ వెంటనే 30 రోజుల పాటు బెయిల్ ఇచ్చింది. ఈ లోగా పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్‌కు అవకాశముంది. హైకోర్టులో పిటిషన్ వేసేందుకు రాహుల్ రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకైతే దీనిపై పూర్తి స్థాయి సమాచారం లేదు. ఎప్పుడు ఆయన న్యాయపోరాటం మొదలు పెడతారన్న క్లారిటీ రావడం లేదు. ఒకవేళ హైకోర్టులో కూడా రాహుల్‌కు ప్రతికూలంగా తీర్పు వస్తే దాదాపు 8 ఏళ్ల పాటు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసహనంతో ఉంది. ఉద్దేశపూర్వకంగా రాహుల్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారని మండి పడుతోంది. అటు బీజేపీ నేతలు మాత్రం ఇదంతా రాహుల్ చేతులారా చేసుకున్నారంటూ తేల్చి చెబుతోంది. ఎంపీలకు రక్షణ కల్పించే ఆర్డినెన్స్‌ను ఆయనే పార్లమెంట్‌లో చించేశారని, కర్మ అనుభవిస్తున్నారని విమర్శిస్తోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాహుల్ గాంధీపై విరుచుకు పడ్డారు. పార్లమెంట్ విలువైన సమయాన్ని వృథా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. యూపీలో కౌశంబి మహోత్సవ్‌ను ప్రారంభించిన అమిత్‌షా ఆ తరవాత బహిరంగ సభలో ప్రసంగించారు. 2024 ఎన్నికల్లోనూ దేశ ప్రజలు మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధానిగా ఎన్నుకుంటారని స్పష్టం చేశారు.
"రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసినందుకు విపక్షాలు ఆందోళన చేశాయి. పార్లమెంట్ విలువైన సమయాన్ని వృథా చేశాయి. ప్రజలు ఆ పార్టీలను ఎప్పటికీ క్షమించరు"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
కాంగ్రెస్ నేతలు పదేపదే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చేసిన వ్యాఖ్యలపైనా అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల కుటుంబం ప్రమాదంలో ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ విమర్శించారు.
"ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు. వాళ్ల కుటుంబం, కులవాదం, వారసత్వ రాజకీయాలు ప్రమాదంలో ఉన్నాయి. వాళ్ల నిరంకుశత్వం ప్రమాదంలో ఉంది. ప్రజలు ఇలాంటి వాళ్లను కోరుకోవడం లేదు. ప్రధాని మోదీ ఇలాంటి కుల రాజకీయాలను చిత్తుగా ఓడించారు. అందుకే..ఎస్‌పీ, బీఎస్‌పీ లాంటి పార్టీలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. అందుకే విపక్షాలు ఇంతగా భయపడుతున్నాయి"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి