Modi responds to Trump comments on ties with India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వైట్ హౌస్‌లో భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన వ్యక్తిగత స్నేహాన్ని, రెండు దేశాల మధ్య "విశిష్ట సంబంధాన్ని" ఆయన ఉద్ఘాటించారు. అయితే, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వైట్ హౌస్‌లో ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. "నేను ఎప్పటికీ మోదీతో స్నేహితుడిగా ఉంటాను. ఆయన గొప్ప ప్రధానమంత్రి. కానీ, ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్న కొన్ని నిర్ణయాలు నాకు నచ్చలేదు. అయినప్పటికీ, భారత్, అమెరికా మధ్య విశిష్ట సంబంధం ఉంది. ఆందోళన ఏమీ లేదు. మా మధ్య కొన్ని సందర్భాల్లో తాత్కాలిక అభిప్రాయ భేదాలు ఉంటాయి," అని పేర్కొన్నారు.
ఈ అంశంపై మోదీ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ భావాలను, మన సంబంధాలపై సానుకూల అంచనాను అభినందిస్తున్నాముమన్నారు. భారతదేశం , అమెరికా చాలా సానుకూలమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే సమగ్ర , ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు.
నిజానికి ట్రంప్ కొన్ని గంటల ముందే తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో భారత్, రష్యాలను చైనాకు "కోల్పోయామ"ని పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వమని అడిగినప్పుడు, "మేము భారత్‌ను కోల్పోలేదని నేను భావిస్తున్నాను. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడంపై నేను నిరాశ చెందాను. ఈ విషయాన్ని నేను వారికి తెలియజేశాను," అని వివరించారు. "మోదీ కొన్ని నెలల క్రితం ఇక్కడకు వచ్చారు. మేము రోజ్ గార్డెన్‌లో కలిసి మాట్లాడాము. అతనితో నాకు చాలా మంచి సంబంధం ఉంది," అని ట్రంప్ తెలిపారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారీ ఎత్తున భారత వస్తువుల దిగుమతులపై పన్నులు విధించారు. ఇంకా విధిస్తామని బెదిరిస్తున్నారు. అయితే ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఓ సారి దూరమయ్యారని అంటారు..మరోసారి భారత్ మిత్రుడేనని అంటారు. ఇలాంటి ప్రకటనలతో అమెరికాతో సంబంధాలపై స్పష్టత కొరవడుతోంది.