Viral News in Telugu: పాకిస్థాన్‌లో ఓ షాపింగ్ మాల్‌పై ప్రజలు మూక దాడి చేశారు. ఒక్కసారిగా ఎగబడి అంతా ధ్వంసం చేశారు. స్టోర్‌లోని వస్తువులన్నీ చోరీ చేశారు. కరాచీలో Dream Bazaar Mall ప్రారంభించిన మొదటి రోజే ఈ బీభత్సం జరిగింది. పాకిస్థాన్‌లోని ఓ బడా బిజినెస్‌మేన్‌ ఈ మాల్‌ని కట్టించాడు. ప్రారంభోత్సవం సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్‌లు పెట్టాడు. పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు. ఇదే కొంప ముంచింది. అనుకున్న దాని కన్నా ఎక్కువ మంది కస్టమర్స్‌ మాల్‌కి భారీ ఎత్తున వచ్చారు. ఆఫర్ కోసం వేలాది మంది ఎగబడ్డారు. మధ్యాహ్నం 3 గంటలకు మాల్‌ని తెరవగా వీళ్లంతా ఒక్కసారిగా లోపలికి చొచ్చుకెళ్లారు. సెక్యూరిటీ ఏమీ చేయలేకపోయింది. అంత మంది వచ్చేసరికి యాజమాన్యానికి ఏం చేయాలో అర్థం కాక చేతులెత్తేసింది. 






రద్దీని కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా అది వాళ్ల వల్ల కాలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుంపులు గుంపులుగా లోపలికి వచ్చి ఎవరికి కావాల్సింది వాళ్లు తీసుకున్నారు. చేతికందిన ప్రతి వస్తువూ లాగేసుకున్నారు. బిల్లు లేదు. డబ్బులు లేవు. ఎవరికి నచ్చింది వాళ్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. వేలాది మంది వచ్చి మీద పడడం వల్ల ఎవరూ ఏమీ చేయలేకపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ స్థాయిలో విధ్వంసం చేస్తారని అనుకోలేదని మాల్ ఓనర్ తలబాదుకుంటున్నాడు. ప్రజలకు తక్కువ ధరలో అన్నీ అందించాలన్న ఉద్దేశంతోనే ఈ మాల్ పెట్టానని, కానీ ఇది అర్థం చేసుకోకుండా ఇలా దాడి చేస్తే ఏం చేస్తామని వాపోతున్నాడు. ప్రస్తుతానికి ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Also Read: Viral Video: బైక్‌పైన షికార్లు చేస్తున్న భారీ మొసలి, వాహనదారులంతా షాక్ - వీడియో