తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేముల తల్లి మంజులమ్మ హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో మంత్రి వేముల శోకసంద్రంలో మునిగిపోయారు.


రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి వేముల సురేందర్ రెడ్డి కూడా ఆనారోగ్యంతో ఏడేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి తల్లి మంజుల మానసికంగా కృంగి పోయింది. ఆనారోగ్యం పాలైంది. గతంలో బ్రేయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. అయితే . మళ్లీ ఏడాదిన్నర నుంచి ఆనారోగ్యంతో వుంది, రెండు నెలలుగా హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.. అయితే పరిస్థితి విషమించి హాస్ప‌ట‌ల్ లోనే మృతి చెందారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి తల్లి మృతి చెందటంతో బాల్కొండ నియోజక వర్గంలో విషాదఛాయలు నెలకొన్నాయి.


ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదట గెలిచిన తర్వాత మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి పదవి వరించింది. దీంతో ఆయనకు రాష్ట్రంలోని రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణాల శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రస్తుతం మంత్రి ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


శుక్రవారం స్వగ్రామంలో అంత్యక్రియలు


నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి. మంజులమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు(CM KCR) సంతాపం ప్రకటించారు. తల్లి మరణంతో శోకతప్తులైన మంత్రి వేములకు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 


పలువురి సంతాపం 


రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ మరణం పట్ల శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంజులమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ మృతిప‌ట్ల బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. వేముల మంజులమ్మ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు కేటీఆర్. వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కేటీఆర్. 


ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ మరణం పట్ల రాష్ట్ర మంత్రులు హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగదీష్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంతాపం ప్రకటించారు. మంజులమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. మంత్రులు జగదేశ్వర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సత్యవతి రథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ పలువురు మంత్రులు సంతాపం తెలిపారు.