Minister ktr: ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరంగల్ టూర్ రాజకీయంగా కాకరేపుతోంది. ప్రధాన పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శాస్త్రాలు సంధించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా వరంగల్‌లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి, అదే ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించిందని మండిపడ్డారు. 


తెలంగాణ ప్రజలను అవమానించారు...


గుజరాత్​లో 20 వేల కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన మోడీ.. వరంగల్​లో మాత్రం కేవలం రూ.500 కోట్లు కేటాయించడం దేనికి సంకేతమని కేటీఆర్ విమర్శించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు తూతూమంత్రంగా వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. ఇది ప్రజలను అవమానించడమే కాకుండా, వారికి ద్రోహం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్న మోడీ.. అభివృద్ధికి అందించిన నిధులు అంతంత మాత్రమేనని మంత్రి ఆరోపించారు. ఒక ప్రధానమంత్రిగా, తెలంగాణకు జరుగుతున్న సెకండ్ క్లాస్ ట్రీట్‌మెంట్‌పై ఎన్డీఏ ప్రభుత్వం బహిరంగ వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.


&nbsp



మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం...


తెలంగాణ పుట్టుకను అవమానించి, విభజన హామీలను తుంగలో తొక్కిన ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణపై మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధికి కనీస నిధులు కేటాయించడం లేదని, ఇంత తక్కువ ఆర్థిక సాయం అందించడం వల్ల తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్‌కు వస్తున్నారని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హామీని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? తొమ్మిదేళ్లపాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ప్రధాని పర్యటనను పూర్తిగా బహిష్కరిస్తున్నాం, మేం ఎవరమూ హాజరుకామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.