Minister Jupalli Krishna Rao on KTR: గత డిసెంబర్‌లో కొల్లాపూర్‌లో జరిగిన మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి హత్య గురించి మంత్రి జూపల్లి క్రిష్ణారావు స్పందించారు. ఆయన తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యాడని.. వ్యక్తిగత కారణాలు, భూ తగాదాల వల్ల అయిన వారే అతణ్ని హత్య చేశారని చెప్పారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు ఆ ఘటనను తెర మీదికి ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు. అతణ్ని హత్య చేసిన నిందితులను శిక్షిస్తామని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 


ఈ విషయంపైనే మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి జూపల్లి క్రిష్ణారావు సీరియస్‌ అయ్యారు. సంక్రాంతి రోజున కేవలం కేటీఆర్‌ కారణంగానే తాను ప్రెస్‌మీట్‌ పెట్టాల్సి వచ్చిందని అన్నారు. ఈ కేసు విషయంలోనే కేటీఆర్‌కు మంత్రి జూపల్లి స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. ఆయన నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు. మంత్రి జూపల్లి క్రిష్ణారావు సోమవారం (జనవరి 15) సెక్రటేరియట్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. కొల్లాపూర్ లో బీఆర్ఎస్ పాలనలో చాలా మందిని హత్యలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు చేయని వాటికి చేశానని తనపై బురద చల్లుతున్నారని అన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. 


మల్లేష్ యాదవ్ హత్య గురించి మాట్లాడుతూ.. మల్లేష్ యాదవ్ బీజేపీ మద్దతుదారుడని.. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్‌ పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఎన్నికల కోసం కేటీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ సర్పంచ్.. బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని ఆయనను హత్య చేశారని జూపల్లి ఆరోపించారు. తన నియోజకవర్గంలో జెడ్పీటీసీ హనుమంత్ నాయక్, సర్పంచ్‌లపై అక్రమ కేసులు పెట్టారని కూడా జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1999 నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో తన మెజార్టీ పెరుగుతూనే ఉందని.. తాను ఎప్పుడూ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. 


గతంలో తన నియోజకవర్గంలో హత్యలపై సాక్ష్యాధారాలతో సహా డీజీపీకి అందించానని గుర్తు చేశారు. అయినా అప్పుడు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. కొండగట్టు దుర్ఘటనలో 60 మంది చనిపోతే బీఆర్ఎస్ వారు వెళ్లి కనీసం పరామర్శించలేదని గుర్తు చేశారు. నడిరోడ్డుపై లాయర్ వామనరావు దంపతుల హత్య, మరియమ్మ ఘటన, దిశ ఘటన లాంటి ఎన్నో ఉదంతాలు బీఆర్ఎస్ పాలనలో మచ్చగా ఉన్నాయని అన్నారు.


నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్ పల్లి గ్రామంలో మల్లేశ్ యాదవ్ అనే వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యారు. ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలు మంచివి కావని ఆరోపించారు. అయితే, మల్లేశ్ హత్యను రాజకీయం చేస్తున్నారని.. ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.