Minister Botsa Clarity on DSC Notification: రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహణపై (DSC Notification) మంత్రి బొత్స (Minister Botsa) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, 2, 3 రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం వస్తుందని స్పష్టం చేశారు. 'డీఎస్సీ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై సీఎం జగన్ (CM Jagan) విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు.' అని తెలిపారు. అటు, అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ఇప్పటికే 10 డిమాండ్లు నెరవేర్చామని అన్నారు. పరిస్థితి అర్థం చేసుకుని సమ్మె విరమించాలని కోరారు.
జీతాల పెంపుపై ఏమన్నారంటే.?
రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇచ్చిన హామీ మేరకు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 పెంచుతామని హామీ ఇచ్చామని, దాని ప్రకారం మొదటి ఏడాది రూ.11 వేలు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు అంగన్వాడీలతో చర్చలు జరిపామని, వారి 10 డిమాండ్లకు అంగీకరించామని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జీతాలు పెంచే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తోందని, పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజు నుంచీ మేనిఫెస్టోలో పొందు పరిచిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
టీడీపీపై విమర్శలు
ప్రభుత్వ హామీల అమలుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై మంత్రి బొత్స మండిపడ్డారు. విజయనగరంలో మాట్లాడిన ఆయన, టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు సహజమని అన్నారు. స్థానిక పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఏ రాజకీయ పార్టీ అయినా సహజంగానే మార్పులు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేల పని తీరు బాగుందని, మార్పు ఉండబోదనే ఆశాభావం వ్యక్తం చేశారు.