ఆంధ్రప్రదేశ్ విద్యుత్,అడవులు, సైన్స్, టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యా పర్యటనకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా టీం ప్రత్యేక ఫోటో సహా అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ప్రకటించింది. ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో లగ్జరీ వాతావరణం ఉన్న ఫ్లైట్‌లో ఆయన రాజసంగా కూర్చుని ఉన్నారు. అంతే రాయల్టీ క్యాప్షన్ కూడా ఆ ఫోటోకు పెట్టారు. అంత వరకూ బాగానే ఉన్నా అసలు ప్రత్యేక విమానంలో రష్యాకు వెళ్లాల్సిన అవసరం ఏమిటన్న విమర్శలు విపక్ష పార్టీలు, ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
దేశంలో ఒక చోట నుంచి మరో ప్రాంతానికి తిరగడానికి ముఖ్యమంత్రులే అతి కష్టం మీద ప్రత్యేక చార్టర్డ్ విమానాలను బుక్ చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వం తరపున చెల్లించడానికే వాటికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇక మంత్రులకు ప్రత్యేక విమానాలు బుక్ చేసుకోవడానికి అనుమతి ఉండదు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏకంగా రష్యాకే స్పెషల్ లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. ఆయన రష్యాకు ఎందుకు వెళ్లారన్నదానిపై స్పష్టత లేదు. అధికారిక పర్యటనా.. లేకపోతే వ్యక్తిగత పర్యటనా అన్నదానిపైనా స్పష్టత లేదు.
ప్రత్యేక విమానంలో బాలినేని రష్యా వెళ్తున్నారు అన్న విషయాన్ని మాత్రమే ఆయన సోషల్ మీడియా టీం ఫేస్‌బుక్‌లో ప్రకటించింది. ఎందుకు వెళ్తున్నారు.. అధికారికమా.. అనధికారికమా అన్నది ప్రకటించలేదు. ఓ వేళ తాను నిర్వహిస్తున్న విద్యుత్,అడవులు, సైన్స్, టెక్నాలజీ శాఖలకు సంబంధించిన పర్యటన అయితే ఆయనతో ఖచ్చితంగా ఉన్నతాధికారులు వెళ్తారు. ఎందుకంటే మంత్రిగా చర్చలు జరిపినా సంతకాలు చేయాల్సింది ఉన్నతాధికారులే. వారు లేకుండా చర్యలు జరపడం కూడా సాధ్యం కాదు. దీన్ని బట్టి చూస్తే ఆయన వ్యక్తిగత పర్యటనకే వెళ్లి ఉంటారన్న అంచనాలు ఉన్నాయి.
Also Read : కొడుకు వివాదాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తలనొప్పి..!
బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత రష్యా పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగా కూడా ఎక్కడా ఉత్తర్వులు బయటకు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం జీవోలన్నింటినీ రహస్యంగా ఉంచుతోంది. అందులో బాలినేనికి రష్యా పర్యటనకు అనుమతి ఇచ్చిన జీవో ఉందో లేదో బయటకు తెలియదు. ఓ వైపు ఏపీలో ట్రూ అప్ పేరుతో చార్జీలను పెద్ద మొత్తంలో పెంచేశారు. ఈ అంశంపై రగడ కొనసాగుతోంది. పన్నులు, చార్జీల పేరుతో ప్రజల వద్ద నుంచి వసూళ్లు చేసి మంత్రులు ఇలా ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారన్న విమర్శలు విపక్ష పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం కానీ బాలినేని కానీ వీలైనంత త్వరగా ఈ ఫోటోపై వివరణ ఇస్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది. లేకపోతే మరిన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంది.