Ambati Rambabu comments: అధికారంలోకి రాలేమని టీడీపీ, జనసేన దాడులకు తెగబడుతున్నాయని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో ఒక బీసీ మహిళా మంత్రి కార్యాలయంపై దాడి చేయడం దారుణం అని అంబటి ఖండించారు. సోమవారం మంత్రి అంబటి విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాలేమని గ్రహించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉగ్రవాదుల్లా మారారని అన్నారు. చంద్రబాబు పది తలల్లో ఒక తలే పవన్ కల్యాణ్ అని వ్యాఖ్యలు చేశారు.
‘‘పొత్తులపై ప్రజల్లో స్పందన లేదని గ్రహించి దాడులకు దిగుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి రజని కార్యాలయంపై దాడి అందులో భాగమే. దమ్ముంటే, ఆమెను ఎన్నికల్లో ఢీకొట్టి గెలవండి.. పార్టీ కార్యాలయంపై దాడి చేయడం కాదు. ఒక పార్టీ అధ్యక్షుడినని చెప్పుకుంటూ పవన్ చెప్పులు చూపిస్తున్నాడు. మీరు అరాచకాలు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖమ్మంలోనూ నాపై దాడి చేసిందీ చంద్రబాబు సామాజికవర్గం వారే.. అరాచకశక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాం.. వారికి రాష్ట్రంలో తావులేదు.
‘‘చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కలయికలో రాష్ట్రంలో రాజకీయాలు మారతాయని ఆశపడ్డారు. అయితే, వారిద్దరి పొత్తుపై ఏ విధమైన రెస్పాన్స్ ప్రజల్లో లేదని గమనించాక.. ఇక, లాభం లేదనుకుని వైఎస్‌ఆర్‌సీపీ పైన దాడులకు తెగబడుతున్నారు. నిన్న గుంటూరులో జరిగిన ఒక ఘటనకు కారణమిదే. చిలకలూరిపేట శాసనసభ్యురాలు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న విడదల రజినీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ ఇంచార్జిగా నియమించారు. నూతన సంవత్సరం మొదటి రోజు నుంచి ఆమె ఇక్కడ ఆఫీసు నుంచి పనిచేయడానికి సర్వం సిద్ధమైన క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో పార్టీ ఆఫీసుపై దాడులకు పాల్పడ్డారు. ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. రాళ్లు వేశారు. బ్యానర్లు చించేశారు.
స్పాట్‌లోనే పోలీసులొచ్చి ఆ దాడి చేస్తున్న ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపులో ఎవరున్నారంటే, అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్లే. తెలుగుదేశం పార్టీ మనుషులు ప్రీప్లాన్డ్‌గా మంత్రి రజినీ ఆఫీసు మీద దాడిచేసి హింసాత్మకంగా అరాచకాలను సృష్టించడం చాలా దురదృష్టకరం. రజినీ గుంటూరులో పోటీ చేస్తుంటే.. మీకెందుకంత కడుపు మంట..? దమ్ముంటే, ఆమెను ఢీకొట్టి గెలవాలి. మీరు గెలిచి ఆమెను ఓడించే పరిస్థితి లేదని తెలుసుకున్నారు గనుకే వారి పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. ఇది ఎంతవరకు సబబు..? ఎప్పుడైతే, తెలుగుదేశం పార్టీ జనసేనతో జతకట్టిందో..ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించేందుకు వారు కంకణం కట్టుకున్నారు.
పవన్‌కళ్యాణ్ పెద్ద అరాచకశక్తి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అందరూ చూస్తుండగా.. కాలి చెప్పు తీసి కొడతానంటాడు. ఇదెక్కడి విడ్డూరం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైన వ్యక్తి అలా చేస్తాడా..? రెండుచోట్ల పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి అతడు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోకపోయినా.. ఆయన్ను అభిమానించే వ్యక్తులు మాత్రం అలా కోరుకోవడం సహజం. అలాంటి వ్యక్తి తాను ఒక పార్టీకి అధ్యక్షుడినని మరిచి బూతులు తిడుతూ.. కాలి చెప్పు చేతబట్టుకుని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్ని కొడతాననడం.. పెద్ద అరాచకం కాదా..? ఆయనో పెద్ద అరాచక శక్తి కాదా..? అలాంటి అరాచక శక్తితో కలిసి చంద్రబాబు రాష్ట్రంలో అరాచకాల్ని సృష్టించేందుకు ప్రయత్నించడం చాలా దురదృష్టకరం’’ అని అంబటి రాంబాబు మాట్లాడారు.