Milan In Visakhapatnam From Tomorrow : విశాఖ నగరంలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో మిలాన్-2024 నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19 నుంచి 27 వరకు రెండు దశల్లో మిలాన్ నిర్వహించేందుకు నేవీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మిలాన్ వేడుకల్లో పాల్గొనేందుకు 50 దేశాల నుంచి అతిథులు వస్తున్నారు. మిలాన్ విన్యాసాల్లో పాల్గొనేందుకు 15 దేశాలకు చెందిన ఇప్పటికే విశాఖకు చేరుకున్నాయి. మిలాన్ కోసం వచ్చిన యుద్ధ నౌకల్లో మేరీటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ఉంది. ఇండియన్ నేవీ నుంచి 20 యుద్ధనౌకలు, యుద్ధ విమాన వాహక నౌకలు విక్రాంత్, విక్రమాదిత్య, పీ8ఐ నిఘా విమానం, మిగ్ 29 యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి. రెండు దశల్లో జరగనున్న మిలాన్ వేడుకలకు వేలాది మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు. తొలి దశలో హార్బర్ ఫేజ్‌లో ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్, మేరిటైమ్ సెమినార్, మిలాన్ టెక్ ఎక్స్‌పో, మిలాన్ విలేజ్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. రెండో దశ సీ ఫేజ్‌లో భాగంగా గగన తల పోరాట పటిమను ప్రదర్శించే విమానాలు, హెలికాప్టర్లు, యాంటీ సబ్‌మెరైన్ విన్యాసాలు ప్రదర్శించనున్నారు.
లక్ష మంది హాజరయ్యే అవకాశం
బీచ్ రోడ్డులో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్‌కి లక్ష మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని నేవీ అధికారులు అంచనా వేశారు. 30 ఎన్‌క్లోజర్లు, 30 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాట్లు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ, వీఐపీ రక్షణ ఏర్పాట్లు, బందోస్తు తదితరాలను పోలీసు విభాగం ఆధ్వర్యంలో చేపట్టారు. బీచ్ ప్రాంతంలో బార్‌కేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఐఐసీ, ఏయూ మైదానంలో పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. మిలాన్‌కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లిఖార్జునతోపాటు ఇతర అధికారులు శని, ఆదివారాల్లో పరిశీలించారు. నిర్వహణ లోపం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేవీకి చెందిన ఉన్నతాధికారులు కూడా పరిశీలించారు.
ఆకట్టుకున్న రిహార్సల్స్
మిలాన్ నేపథ్యంలో శనివారం సాయంత్రం బీచ్ రోడ్డు, సముద్ర తీరంలో చేపట్టిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్కై డైవర్స్ పారాచూట్ల సహాయంతో చేసిన విన్యాసాలు మెస్మరైజ్ చేశారు. నేవీ హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీతోపాటు పలు దేశాలకు చెందిన నేవీ సిబ్బంది చేపట్టిన మార్చ్‌ఫాస్ట్ ఆకట్టుకుంది. శనివారం సెలవు దినం కావడంతో వేలాది మంది సందర్శకులు బీచ్‌కు తరలివచ్చి విన్యాసాలను తిలకించారు. మిలాన్ వేడుకలు కోసం నగరవాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.