Gang Rape In Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని మురేనా జిల్లాలో అమానుష ఘటన జరిగింది. మహిళా జాతికి మచ్చ తెచ్చే దారుణం వెలుగులోకి వచ్చింది. సాటి మహిళ, నిండు గర్భిణి అని చూడకుండా ఓ మహిళ.. తన భర్త, మరో ఇద్దరితో కలిసి అత్యాచారానికి ప్రేరేపించింది. మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలు గర్భిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను చంపేందుకు ప్లాన్ చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు.  80 శాతం కాలిన గాయాలతో కడుపులో బిడ్డతో సహా ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు, స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని మురేనా జిల్లాకు చెందిన ఓ గర్భిణి తన భర్త మీద అత్యాచార ఆరోపణలు చేసిన ఓ మహిళతో రాజీ కుదుర్చుకునేందుకు వెళ్లారు. 


ఆ సమయంలో ఆమెపై ఆ మహిళ భర్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆ మహిళ, ముగ్గురు పురుషులు కలిసి గర్భినిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు గ్వాలియర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గర్భిణిపై అత్యాచారం, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ భర్త గతంలో ఓ అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ నమోదు చేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.


ఉజ్జయినిలో దారుణం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గత ఏడాది సెప్టెంబర్‌లో కొందరు రాక్షసులు 12 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి, దండి ఆశ్రమం సమీపంలో వదిలేసి వెళ్లారు. చిన్న అమ్మాయి అనే కనికరం కూడా లేకుండా.. దుండగులు ఆ బాలికపై పైశాచికత్వం ప్రదర్శించారు. అత్యంత దారుణంగా అత్యాచారం చేసి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. రక్తస్రావంతో అర్ధనగ్నంగానే బాలిక ఇంటి బాట పట్టింది. ఆమె పరిస్థితిని చూసి కూడా ఎవ్వరూ ఆదుకోవడానికి ముందుకు రాలేదు. ఒక చోట వ్యక్తి కనిపించడంతో సహాయం చేయమని అర్థించింది. కానీ అతడు తిరస్కరించడంతో ఆ బాలిక అక్కడి నుంచి వెళ్లిపోయింది. మనసుల్ని కదిలించే ఈ హృదయ విదారక దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.


అక్టోబర్‌లో ఇలాంటి ఘటనే
మధ్యప్రదేశ్‌ అశోక్‌ నగర్‌ జిల్లాలో గత అక్టోబర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళను కిడ్నాప్‌ చేసిన నలుగురు వ్యక్తులు, ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పంటపొలాల్లో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని బాధిత మహిళను శరోదాలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. దాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురి పేర్లను బాధిత మహిళ పోలీసులకు తెలియజేసింది. ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్ట్ చేశారు. 


పదకొండేళ్ల చిన్నారిపై దారుణం
సాత్నా జిల్లాలోని మైహర్ టౌన్ ఆర్కండీ టౌన్ షిప్‌లో గత జులైలో దారుణ అత్యాచారం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలికను  గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. రాత్రి వరకూ చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టారు. చివరకు మరుసటి రోజు ఇంటికి దగ్గర్లోని అడవిలో పాపను దారుణ స్థితిలో గుర్తించారు. రక్తపుమడుగులో కనిపించిన కూతురును చూసి కన్నీరుమున్నీరయ్యారు.. పాప శరీరంపై ఎక్కడ చూసినా పంటిగాట్లే ఉన్నాయని స్థానికులు తెలిపారు. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.