Bill Gates With Dolly Chaiwala: మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. భారత్‌లో పర్యటించిన బిల్‌ గేట్స్ ఓ ఛాయ్‌వాలా దగ్గర టీ తాగారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన డాలీ ఛాయ్‌వాలా (Dolly Chaiwala) స్టాల్ వద్దే టీ తాగారు. ఆ తరవాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పెట్టారు. భారత్‌లోని ఇన్నోవేషన్‌ గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారు. "భారత్‌లో మీరు ఎక్కడికి వెళ్లినా ఎన్నో ఆవిష్కరణలు మీకు ఎదురవుతాయి. చిన్న టీ కప్పు తయారు చేయడంలోనూ ఇది కనిపిస్తుంది" అంటూ డాలీ ఛాయ్‌వాలాపై ప్రశంసలు కురిపించారు. "ఓ ఛాయ్ ప్లీజ్" అంటూ ఆ వీడియోలో బిల్ గేట్స్ డాలీని అడిగారు. ఓ స్పెషల్ వెహికిల్‌లో డాలీ ఛాయ్‌వాలా టీ తయారు చేసే విధానాన్ని వీడియో తీశారు. నిజానికి ఇదే అతడిని ఫేమస్ చేసింది. ఆ టీని ఆస్వాదించిన బిల్‌గేట్స్ భారత్‌కి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఓ కప్పు టీని కూడా ఇంత క్రియేటివ్‌గా తయారు చేయడం ఇండియాలోనే సాధ్యం అంటూ ప్రశంసించారు. ఈ వీడియో చివర్లో ఛాయ్‌ పే చర్చా అంటూ డాలీ ఛాయ్‌ వాలా వెనక నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు బిల్‌గేట్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.