అగ్నివీరులకు సీఏపీఎఫ్‌లో రిజర్వేషన్లు
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిలిపివేసే ఆలోచనే చేయటం లేదు కేంద్రం. ఇది దేశ యువతకు మంచి అవకాశమని, అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారని వివరిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. అయినా ఆందోళనలు మాత్రం ఆగటం లేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మరింత స్పష్టతనిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. రిలాక్సేషన్లు ఇచ్చి నిరసనలు తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర హోం శాఖ కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. అగ్నిపథ్‌లో భాగంగా రిక్రూట్ అయిన వారికి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్-CAPF,అసోం రైఫిల్స్‌లో 10% రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడించింది. అలాగే ఈ దళాల్లో చేరే వారికి నిర్దేశించిన ఏజ్ లిమిట్‌ని కూడా మూడేళ్లు పెంచింది. అగ్నిపథ్ తొలిబ్యాచ్‌కి ఈ వయోపరిమితిని ఐదేళ్ల వరకూ పొడిగిస్తున్నట్టు ట్వీట్‌లో పేర్కొంది.
అగ్నిపథ్‌కు ఎవరు అర్హులు..?
కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట అగ్నిపథ్. సైనికుల నియామకంలో కొత్త ఒరవడికి ఇది నాంది పలుకుతుందని కేంద్రం చాలా గట్టిగా చెబుతోంది. యువతకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఇటీవలే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఇదో చరిత్రాత్మక నిర్ణయమని, మొదటి విడతలో 46 వేల మందిని సైనికులుగా తీర్చి దిద్దుతామంటూ వెల్లడించింది కేంద్రం. త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు వీళ్లు విధులు నిర్వర్తిస్తారు. సైన్యంలోకి యువరక్తాన్ని ఆహ్వానించటం ద్వారా భారత్ మరింత శక్తిమంతమవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పైగా..రెగ్యులర్ సైనికులకు అందించే పెన్షన్లు, జీతాలు కోసం చేసే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చని భావిస్తోంది. ఈ అగ్నిపథ్ సర్వీస్‌లో చేరేందుకు 17.5-23 ఏళ్ల వాళ్లు అర్హులు. ఎంపికైన వారికి ఆర్నెల్ల పాటు శిక్షణ అందించి మూడున్నరేళ్ల పాటు సర్వీసులో ఉంచుతారు. ఈ నాలుగేళ్లు పూర్తయ్యాక ప్రతిభ ఆధారంగా 25% మందిని శాశ్వత కమిషన్‌లో పని చేసేందుకు అవకాశం కల్పిస్తారు. మంచి ప్యాకేజీ కూడా అందిస్తారు. తొలి సంవత్సరం రూ.4.76 లక్షల ప్యాకేజీ అందిస్తారు. వీరిని అగ్నివీరులుగా అభివర్ణిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ రిక్రూట్‌మెంట్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అగ్నిపథ్ సర్వీస్‌ని ప్రారంభించాలని ఐడియా 2020లోనే వచ్చిందట. ఇది మాజీ సైనికాధ్యక్షుడు బిపిన్ రావత్ ఆలోచన. సైన్యం కోసం చేస్తున్న ఖర్చుని వీలైనంత వరకూ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఆలోచన చేశారట.