మొసలితో పెళ్లి..ఇదో ఆచారమట..


ప్రపంచవ్యాప్తంగా రోజూ ఏదో ఓ మూల రకరకాల వింత సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుంటాయి.ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మెక్సికోలోని ఒక్సాకా మేయర్ అలిగేటర్‌ (పెద్ద మొసలి)ని పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ప్రేమగా దానికి ముద్దు కూడా పెట్టాడు. మరి ఇంత అరుదైన సీన్‌ని చూస్తూ అలా ఊరుకుంటారా. చుట్టు పక్కన వాళ్లంతా ఈ తంతుని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇక అప్పటి నుంచి ఈ మెక్సికో మేయర్ గురించే ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. మొసలిని పెళ్లి చేసుకోవటమా..? ఇదేం విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారంతా. మెక్సికోలోని సాన్ పెడ్రో హ్యుమెలులా ప్రాంత మేయర్ విక్టర్ హుగో ఈ పని చేసినప్పటి నుంచి ఎందుకిలా పెళ్లి చేసుకున్నాడబ్బా అని అందరూ ఆరా తీయటం మొదలు పెట్టారు. ఇంతకీ తేలిందేంటంటే ఇది అక్కడి ఆచారమట. 


ప్రకృతిని, మనుషుల్ని కలిపే వేడుక ఇది..


శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. ఈ ప్రాంతంలో రకరకాల కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ప్రజలు నివసిస్తుంటారు.వీళ్లు ప్రకృతిని ఆరాధించటంలో భాగంగా ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటారట. సరైన విధంగా వర్షాలు పడాలని, అందరకీ ఆహారం దొరకాలని, నదుల్లో చేపలు పుష్కలంగా దొరకాలని కోరుకుంటారట. ఈ కోరికలు తీరాలంటే ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోక తప్పదని అంటున్నారు స్థానికులు. అందుకే ఈ ఏడేళ్ల మొసలికి వైట్‌డ్రస్‌ వేసి పెళ్లి కూతురులా తయారు చేశారు. మూతిని మాత్రం కట్టేశారు. ఈ మొసలిని "మహారాణి"గా భావిస్తారు. పెళ్లి కూతురు వేషంలో ఉన్న ఈ మొసలి భూతల్లికి మరో రూపమని, పెళ్లి చేసుకోవటం ద్వారా, ప్రకృతిని, మనుషుల్ని ఏకం చేసినట్టవుతుందని విశ్వసిస్తారు. సాధారణ పెళ్లిళ్లలో ఎలాగైతే పెళ్లికూతుర్ని బ్యాండ్ బాజాలతో వేదికపైకి తీసుకొస్తారో, అలాగే ఈ మొసలికీ స్వాగతం పలికారు. ఒకరు ఈ మొసలిని చేతిలో పట్టుకుని వస్తుంటే చుట్టూ ఉన్న వాళ్లంతా ట్రంపెట్స్, డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమైతే నెటిజన్లు ఊరుకుంటారా. లైక్స్‌, కామెంట్స్‌, షేర్స్‌తో ఫేమస్ చేసేశారు. "మొసలికి అప్పుడే పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా" అని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.