ప్రయాణికులకు తప్పని తిప్పలు 


సికింద్రాబాద్ ఆందోళనలతో ఒక్కసారిగా సిటీ అంతా అలజడి రేగింది. హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పలు ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీసులు సహా, మెట్రోలనూ అప్పటికప్పుడు నిలిపివేశారు. ఫలితంగా నిత్యం మెట్రోలో ప్రయాణించే వారికి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే పలువురు ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. సర్వీసులు పునరద్ధరించాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే మెట్రో అధికారులు మాత్రం అది తమ చేతుల్లో లేదని స్పష్టం చేశారు. ఏం చేయాలో అర్థం కాక ప్రజలు వెనుదిరుగుతున్నారు. రోజూ వేలాది మంది మెట్రో సర్వీస్‌లను వినియోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు పూర్తిగా మెట్రోపైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి సర్వీస్‌ ఆపేయటం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే షిఫ్ట్‌ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాలనుకునే వారికి తిప్పలు తప్పటం లేదు. 


మనీ రీఫండ్ చేస్తామని చెప్పిన రైల్వే అధికారులు 


ఓలా, ఊబర్ లాంటి సంస్థలూ రైడ్ ఛార్జెస్‌ని విపరీతంగా పెంచేశాయి. సమస్యాత్మక ప్రాంతాల్లోకి బైక్‌లు, క్యాబ్‌లు అసలు బుక్ కావటం లేదు. మిగతా ప్రాంతాల్లోనూ మునుపటి కంటే రెట్టింపుగా ఛార్జ్ చేస్తున్నాయి. 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు వెళ్లాలన్నా రూ.100 వరకూ ఛార్జ్ చూపిస్తోందని కొందరు సిటిజన్లు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో మెట్రో నడుస్తుండటం వల్ల కొంతలో కొంత రోడ్ ట్రాఫిక్ కంట్రోల్అవుతోంది. మెట్రో రద్దవటం వల్ల సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగానే ప్లాట్‌ఫామ్‌లపైనే తల దాచుకోవాల్సి వచ్చింది. చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. కళ్లముందే ఆందోళనకారులు బోగీలు తగలబెడుతుండటాన్ని చూసి భయపడిపోయారు. రైళ్లూ రద్దు కావటం వల్ల
ఏం చేయాలో పాలుపోక స్టేషన్‌లోనే చిక్కుకున్నారు. అయితే ఇప్పటికే టికెట్‌లు బుక్‌ చేసుకున్న వాళ్లకు మనీ రీఫండ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.


చర్చలకు రావాలంటున్న పోలీసులు, వెనక్కి తగ్గని నిరసనకారులు 


కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఆర్మీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఆందోళనకారులు బీభత్సం సృష్టించటం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. అల్లర్లను కట్టడి చేసే ప్రయత్నం చేసినా అది సాధ్య పడలేదు ఫలితంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. అప్పటికీ ఆందోళనకారులు అల్లర్లు ఆపలేదు. పైగా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితులు చేయి దాటిపోవటం వల్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే యువకులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఈ తోపులాటలో పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లోనే ఒకరు మృతి చెందారు. ఆందోళనకారులు వెంటనే వెనక్కి తగ్గాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా నిరసనకారులు మాత్రం వెనకడుగు వేయటం లేదు. 10 మంది ముందుకు వచ్చి తమతో చర్చించాలని పోలీసులు సూచిస్తున్నప్పటికీ ఆర్మీ అభ్యర్థులు అందుకు అంగీకరించటం లేదు.