Menstrual Leave Policy in India: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలన్న నిబంధన తీసుకొస్తే కంపెనీలు వాళ్లను రిక్రూట్ చేసుకోవడమే మానేసే ప్రమాదముందని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని కోర్టుల్లో తేల్చలేమని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలసరి సెలవులు తప్పనిసరి చేసేలా కంపెనీలకు ఆదేశాలివ్వాలని పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇది ప్రభుత్వ పరిధిలోని విషయమని వెల్లడించారు. 


"నెలసరి సెలవులు తప్పనిసరి చేస్తే మహిళల్ని మనంతట మనమే ఉద్యోగాల నుంచి దూరం చేసిన వాళ్లమవుతాం. వాళ్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌ని గందరగోళంగా మార్చకూడదు. అయినా ఇది ప్రభుత్వం పరిధిలో ఉండే విషయం. కోర్టుల్లో ఏమీ తేల్చలేం. కోర్టు ఇందులో జోక్యం చేసుకోవడం సరికాదు"


- చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ 


ఇదే సమయంలో పిటిషనర్‌కి ఓ సలహా కూడా ఇచ్చారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీని వెళ్లి కలవాలని సూచించారు. సెక్రటరీ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌కి సంబంధించి అన్ని అంశాలూ పరిశీలించి అలాంటి పాలసీలు చేయగలమా లేదా అన్నది ఆలోచించాలని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇలాంటి పిటిషన్‌ కోర్టులో దాఖలైంది. అప్పుడూ కోర్టు ఇదే విధంగా స్పందించింది. ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాలను కోర్టు తేల్చలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కేరళ సహా బిహార్‌లో మాత్రమే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నారు. బిహార్‌లో రెండు రోజుల సెలవులు ఇస్తుండగా కేరళలో మూడు రోజుల పాటు లీవ్స్ ఇస్తోంది ప్రభుత్వం.