Meet world richest beggar owns luxury flats in Mumbai: ఏ పనీ చేయలేని వాళ్లు ఇక అన్నీ వదిలేసి అడుక్కుంటారు.కానీ అడుక్కోవడమూ ఓ కళేనని అందులో లక్షలు సంపాదించవచ్చని నిరూపించేవాళ్లు కొంత మందిఉంటారు. ముంబైలోని ఈ బెగ్గర్ ప్రపంచంలోని బిచ్చగాళ్లందరికెల్లా ధనవంతుడు. అతడి పేరు భరత్ జైన్.
ప్రపంచంలోనే అత్యంత ధనిక బిచ్చగాడిగా భరత్ జైన్ గా గుర్తింపు పొందారు. అడుక్కోవడం ద్వారా సంపాదించిన డబ్బుతో ముంబైలో రూ. 1.4 కోట్ల విలువైన రెండు లగ్జరీ ఫ్లాట్‌లను సొంతం చేసుకున్నాడు. అతని నికర విలువ దాదాపు రూ. 7.5 కోట్లుగా అంచనా .
భరత్ జైన్ గత నాలుగు దశాబ్దాలుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్‌టీ), ఆజాద్ మైదాన్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో బిచ్చమెత్తుతూ ఉంటాడు. రోజుకు 10 నుండి 12 గంటలు, వారంలో ఏడు రోజులు, ఏడాది పొడవునా ఎటువంటి సెలవులు లేకుండా అతను ఈ పనిని కొనసాగిస్తున్నాడు. అతని రోజువారీ ఆదాయం రూ. 2,000 నుండి రూ. 2,500 వరకు ఉంటుంది. ఇది నెలవారీ రూ. 60,000 నుండి రూ. 75,000 వరకు సమానం. ఇది భారతదేశంలోని చాలా ఎంట్రీ-లెవల్ కార్పొరేట్ ఉద్యోగాల కంటే ఎక్కువ.
భరత్ జైన్ తన ఆదాయాన్ని వృథా చేయకుండా, స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడి పెట్టాడు. అతను ముంబైలోని పరేల్ ప్రాంతంలో రూ. 1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్‌లను కొనుగోలు చేశాడు. ఇక్కడ అతను తన భార్య, ఇద్దరు కుమారులు, తండ్రి, సోదరుడితో నివసిస్తున్నాడు. అదనంగా, అతను థానేలో రెండు షాపులను కొనుగోలు చేశాడు, ఇవి నెలకు రూ. 30,000 అద్దె ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ ఆదాయం అతని కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది.
భరత్ జైన్ జీవితం కేవలం సంపద సముపార్జనకే పరిమితం కాలేదు. అతను తన ఇద్దరు కుమారులకు ముంబైలోని ప్రముఖ కాన్వెంట్ స్కూల్‌లో విద్యను అందించాడు. ప్రస్తుతం, అతని కుమారులు స్టేషనరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అతని ఆర్థిక స్థిరత్వం , సంపద సముపార్జన ఉన్నప్పటికీ, భరత్ జైన్ బిచ్చగట్టడాన్ని కొనసాగిస్తున్నాడు. కొందరు దీనిని అలవాటుగా భావిస్తే, మరికొందరు దీనిని వినయంగా చూస్తున్నారు. తాను దురాశపరుడిని కాదని ఇది తన పని అని ఆయన చెప్పుకుంటున్నారు. భరత్ జైన్ తరహాలో కాకపోయినా కొంత మంది బెగ్గర్లు కూడా ధనవంతులుగా ఉన్నారని సోషల్ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.