Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి నాణ్యత లోపాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బ్యారేజీకి పగుళ్లు, నెర్రెలు కనిపించాయి. రూ.3,652 కోట్లతో నిర్మించిన ఈ బ్యారేజీకి భారీ స్థాయిలో పగుళ్లు వచ్చాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలో గేటు దగ్గర పగుళ్లను స్పష్టంగా చూడొచ్చు. ఏడో బ్లాక్ తో పాటు ఆరు, ఎనిమిది బ్లాక్ లలో కూడా మరిన్ని పిల్లర్స్ కు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆ బ్యారేజీ దిగువన 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్ 100 మీటర్లు కొట్టుకుపోయాయి.
అయితే, మేడిగడ్డ బ్యారేజీపై ప్రస్తుత ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. నీటిపారుదల అధికారులతో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీలకు సంబంధించి వాస్తవం ఏమిటో చెప్పాలని.. సగంసగం చెప్పి కీలక విషయాలను దాచాలనే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కేంద్ర జలసంఘం, నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులతో.. నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలు క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత.. వాటి భద్రతకు ఏ ఇబ్బంది లేదని సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే దెబ్బతిన్నచోట పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదలశాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్ఠత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో లోతుగా రీసెర్చ్ చేయాలని, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లాలని ఇటీవల రేవంత్ రెడ్డి సూచించారు.
మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి డ్యామేజీ అయిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి రిపోర్ట్ రెడీ చేసినట్లు తెలిసింది. వరద ఉద్ధృతి అంచనా లేకుండానే మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ చేశారని.. ఈ బ్యారేజ్ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని గుర్తించినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ లొకేషన్, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అంతా గందరగోళంగా ఉందని వారు తేల్చినట్లు తెలిసింది. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు దోషులేనని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మధ్యంతర రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, ఈ మధ్యంతర నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించేందుకు విజిలెన్స్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ స్పందన
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. తన హామీలు తప్పించుకునేందుకే మేడిగడ్డను సాకుగా చూపి రోజుకు ఓ అవినీతి కథ అల్లుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగి ఉంటే వెలికి తీయమనే తాము చెబుతున్నామని అన్నారు. ఆ విషయంలో తాము కూడా సహకరిస్తామని చెప్పారు. నిన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై కేటీఆర్ ఈ మేరకు స్పందించారు.